-ప్రకృతి పర్యాటకానికి అనుకూలమని వెల్లడించిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి
రాజానగరం / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూపార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. బుధవారం రాజానగరం మండల పరిధిలోని దివాన్ చెరువులో ఉన్న అటవీ భూమిని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని, సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం త్వరలో కార్యాచరణ రూపకల్పన చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాంత భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అనుకూలతలపై కేంద్ర పరిశీలన కోసం వొచ్చిన సభ్యులతో కలిసి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చయడం జరిగిందన్నారు.
అనంతరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ.. ప్రకృతి పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమని తెలిపారు. ప్రస్తుతం రాజానగరంలో సుమారు 311 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉందని, అందులో 250 హెక్టార్ల భూమిని జూపార్కు కోసం వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర
పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఆఫీసర్ బెన్ నేతృత్వంలోని బృందాన్ని రాజానగరానికి పంపినట్లు ఎంపీ దగ్గుబాటి వివరించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం జూపార్కు ఏర్పాటుకు ఈ ప్రదేశం అనుకూలమని బృందం నిర్ధారించినట్లు ఆమె తెలిపారు. జంతువులు, పక్షులను బంధించినట్లు కాకుండా, సహజ వాతావరణంలోనే సందర్శకులు వీక్షించేలా సరికొత్త విధానంలో జూపార్కును అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అన్ని అనుకూలిస్తే రాజానగరానికి త్వరలో జూపార్కు రానుందని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ పేర్కొన్నారు.
ఈ పర్యటనలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, సెంట్రల్ జూ అథారిటీ సభ్య కార్యదర్శి డా. వి. క్లెమెంట్ బెన్,
వన్యప్రాణి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఫారెస్ట్ ప్రొటెక్షన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సీజేఎకు చెందిన అజయ్, డీఎఫ్‌ఓ రాజమహేంద్రవరం బి . ప్రభాకర రావు, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ఆర్. శ్రీనివాస్, ఎఫ్‌ఆర్‌ఓ దావీద్ రాజు, పద్మావతి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ లత, ఎఫ్‌బీఓ రంగారావు అటవీ శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News