-ఏర్పాట్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జె. నివాస్…
-కృష్ణావేణి ఘాట్, కేశఖండనశాల, లడ్డు ప్రసాదాల వంటశాలను పరిశీలించిన కలెక్టర్ …
-రెండు రోజులపాటు కొండపైకి ఎటువంటి వాహనాలకు అనుమతి లేదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దుర్గ గుడికి వచ్చే భవాని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక సదుపాయాలకల్పనలో ప్రత్యక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ఆయన నగరంలోని సీతమ్మవారి పాదాల వద్ద కృష్ణావేణి ఘాట్‌ను సందర్శించి, అక్కడ ఉన్న లోటుపాట్ల గురించి భవాని భక్తులను అడిగి తెలుసుకున్నారు. శని, ఆదివారాల్లో దుర్గమ్మను దర్శించుకునే భవానిల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. కృష్ణావేణి ఘాట్‌లో భవానిలు స్నానం అనంతరం విడిచిపెట్టిన దుస్తులను పరిశీలించిన పిమ్మట అక్కడ నుంచి ఎప్పటికప్పుడు తీసివేసి ఘాట్ శుభ్రంగా వుంచాలని సంబంధిత అధికారులను సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కేశఖండనశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. కేశఖండనశాలలో వినియోగిస్తున్న బేడ్లు, ఇతర పరికరాలను పరిశీలించి వాటి శుభ్రత, శానిటేషన్ పనితీరుపట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ ఉన్న పర్యవేక్షణ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించి మరింత పరిశుభ్రంగా వుంచేందుకు అవసరమైన సూచనలు చేశారు. అక్కడ నుండి ప్రసాదాల కౌంటర్‌కు చేరుకుని లడ్డు ప్రసాదాలు భక్తులకు అందిస్తున్న తీరును కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. దుర్గమ్మ దర్శినం చేసుకున్న భక్తులకు ఒక్కొక్కరికి 5 లడ్డుల చొప్పున మాత్రమే అందించాలన్నారు. ఈ ప్రసాదాలు భక్తులకు అందించడంలో వేగం పెంచడానికి సిబ్బంది కృషి చేయాలన్నారు.అనంతరం ప్రసాదాల తయారీ వంటశాలను కలెక్టర్ జె. నివాస్ సందర్శించారు. ప్రసాదాల తయారీలో ముఖ్యంగా శుభ్రత, నాణ్యత లడ్డు తయారీలో పాటించాలన్నారు. ఏ విషయంలోను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్ జె. నివాస్ సూచించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్,విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్, సియంఒహెచ్ డా. గీతాబాయి తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News