-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది…
-అగ్ర వర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడి ఉన్నవారు ఈడబ్ల్యుఎస్ కోటాను వినియోగించుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తన వంతు సహకారాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పర్యటించిన రాందాస్ అథవాలే ఈ రోజు విలేకర్ల సమావేశం లో మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా షెడ్యూలు కులాలు, తెగలు, వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కృషి చేస్తున్నారని వారి అభివృద్ధికి దోహదపడే పథకాలను నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. రిజర్వేషన్ల అంశంలో వర్గాలకు అతీతంగా అర్హులందరికీ సమ న్యాయం అందిస్తామని రాందాస్ అథవాలే తెలిపారు. అగ్ర కులాలలో సైతం ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నారని, వీరికి ఈబీసీ కోటా కింద రిజర్వేషన్లను కల్పించాలానే డిమాండ్ నాలుగు సంవత్సరాలుగా ఉందన్న మంత్రి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల తరగతి కింద నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దీనిని అమలుచేస్తోందని తెలిపారు . అగ్రవర్ణాల్లోని పేదలు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు (ఈడబల్యూఎస్) రిజర్వేషన్ ఉపయోగించుకుని ప్రయోజనం పొందాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో చేరడం ద్వారా మరింత అభివృద్ధి సాధించడానికి వీలవుతుందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం రాందాస్ అథవాలే ప్రముఖ అంబేద్కర్ వాది, బౌద్ధ ప్రముఖుడు కాశీ కృష్ణ సంస్మరణ సభలో పాల్గొని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో అమలాపురం లోక్ సభ సభ్యురాలు సీహెచ్ అనూరాధ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News