-‘పోస్ట్ కార్డ్స్ ఉద్యమం’ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొగాకు వినియోగం ప్రాణాంతకమని, అందరూ వాటికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత అస్సలు తీసుకోవద్దని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ హితవు పలికారు. శుక్రవారం ఉదయం నవజీవన్ బాల భవన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటోనగర్ అర్.టి.సి. బస్ స్టాండ్ ఆవరణలో ప్రపంచ పొగాకు వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా “పోస్ట్ కార్డ్స్ ఉద్యమం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు హాజరయ్యారు. పొగాకు వ్యతిరేక సందేశంతో మొదటి పోస్టు కార్డును ఆయన పూర్తి చేసి అందజేశారు. అనంతరం ప్రత్యేక పొగాకు వ్యతిరేక పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ, పొగాకు ఆరోగ్యానికి అత్యంత హానికరమని తెలిపారు. పొగాకు వినియోగం వలన శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గుండెజబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. అనంతరం అవి ప్రాణాంతకమవుతాయని చెప్పారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నవజీవన్ సంస్థ వినూత్నంగా నిర్వహిస్తున్న “పోస్ట్ కార్డ్స్ క్యాంపెయిన్” అభినందనీయమని కొనియాడారు. వారు నిర్వహిస్తున్న “పోస్ట్ కార్డ్స్ ఉద్యమం” ద్వారా ప్రజలు, విద్యార్థులు, యువత, కార్మికుల్లో పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం లక్ష్యమని తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాలు, విజ్ఞప్తులు, పొగాకు వ్యతిరేక సందేశాలను పోస్ట్ కార్డులపై రాసి ప్రచారానికి మద్దతు తెలియజేయాలని కోరారు.
నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ తంబీ జోసెఫ్ మాట్లాడుతూ ఈ “పోస్ట్ కార్డ్స్ క్యాంపెయిన్” ద్వారా పొగాకు రహిత జీవనశైలిని ప్రోత్సహించడం, పిల్లలు మరియు యువతను వ్యసనాల నుండి రక్షించడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రజలను భాగస్వాములను చేయడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. పొగాకు నియంత్రణ మరియు ప్రజారోగ్య పరిరక్షణలో సామూహిక బాధ్యత ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో, విద్యాసంస్థల్లో, ఆర్టీసీ బస్ స్టాండ్లలో, మరియు కమ్యూనిటీ ప్రాంతాల్లో పలువురు వాలంటీర్లు, విద్యార్థులు, సాధారణ ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయని వివరించారు.
అనంతరం ప్రోగ్రాం మేనేజర్ గోళ్ళమూడి శేఖర్ బాబు మాట్లాడుతూ, యువత పొగాకు అలవాట్లకు దూరంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కుటుంబ స్థాయిలోనే అవగాహన కల్పించాలని సూచించారు. సమాజంలో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంలో ఇటువంటి ప్రచార కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ ఇంజినీర్ కే. శ్రీనివాసరావు, ఎ.డి.సి. వైవీఎస్ఎం. రావు, ఎం. మోహనరావు, ఆర్టీసీ హెడ్ కానిస్టేబుల్ కెవి.రావు, ఆటోనగర్ పోస్టుమెన్ రవి కుమార్, నవజీవన్ సైకాలజిస్ట్ జి. అనూష, జోనల్ కో-ఆర్డినేటర్ జె. జ్యోతి చంద్రిక, ఎస్కే నజ్మా, బస్ డ్రైవర్లు, కండక్టర్లు మరియు ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొని పొగాకు వ్యతిరేక సందేశాలను పోస్ట్ కార్డుల ద్వారా తెలియజేశారు.
Prajavartha Online Telugu News