విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
57వ డివిజన్ సుబ్బరాజు నగర్, కనకదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రత్యక్షంగా గురువారం పరిశీలించారు, స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత ఇంజినీర్లు, అధికారులతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహించారు, పెండింగ్‌లో ఉన్న పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ:- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సహకారంతో గత రెండు సంవత్సరాల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు రూ.350 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రహదారులు, సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, తాగునీటి పైప్లైన్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్ సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి వంటి అనేక పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని కల్పించామని…
అయితే కొన్ని ప్రాంతాల్లో గతంలో వివిధ కారణాల వల్ల పూర్తికాని చిన్నచిన్న పనులు ఇంకా మిగిలి ఉన్నాయని, వాటిని కూడా ఒక్కొక్కటిగా గుర్తించి శాశ్వతంగా పరిష్కరిస్తున్నామని, 57వ డివిజన్లోని సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతాల్లో సుమారు 150 మీటర్ల డ్రెయిన్ నిర్మాణం పూర్తికాకపోవడంతో వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.
దీనిపై వెంటనే స్పందించిన తాను సంబంధిత అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్‌తో కలిసి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నెలరోజుల్లోగా 150 మీటర్ల డ్రెయిన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయంతో ఇంటి పట్టాలను వారి ఇంటి వద్దకే అందజేసే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు.
“ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం మా ప్రభుత్వ బాధ్యత. సమస్య తెలిసిన వెంటనే స్పందించడం మా పని. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు… ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.
సెంట్రల్ నియోజకవర్గంలో మిగిలి ఉన్న ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేయడంతో పాటు ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తూ, రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశం సంగం వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, డివిజన్ అధ్యక్షులు Sk. కబీర్, క్లస్టర్ ఆలా తారకరామారావు, ఎరుబోతు కనకరావు, గుప్తా శ్రీనివాస్, పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News