గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జిఎస్ఆర్ నం.571(ఈ) (తేదీ: 12-08-2021) మరియు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ – 2016 నిబంధనల ప్రకారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆగస్టు 15, 2026 నుండి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, అలాగే నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం, విక్రయం, నిల్వ, పంపిణీ, రవాణాపై సంపూర్ణ నిషేధం అమలులోకి రానుందని, పర్యావరణ పరిరక్షణ, నగర పరిశుభ్రతకు నగర ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ఉన్న వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు, వీధి వ్యాపారులు మరియు ప్రజలందరూ ఇకపై పర్యావరణం, ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కల్గిస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా స్వస్తి పలికి, వాటికి ప్రత్యామ్నాయంగా కాగితపు సంచులు, జూట్ బ్యాగులు మరియు గుడ్డ సంచులు వంటి పర్యావరణహిత వస్తువులను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఆగస్ట్ 15 నుండి ఈ నిబంధనలను ఉల్లంఘించి నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను వినియోగించినా, విక్రయించినా లేదా నిల్వ ఉంచినా రూ.5వేల వరకు జరిమానా విధించడంతో పాటు, సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. నగర పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు లేదా సమాచారం అందించాలనుకున్నా నగర ప్రజలు గుంటూరు నగరపాలక సంస్థ హెల్ప్‌లైన్ నెంబర్ 0863-2345103 ను సంప్రదించవచ్చని, ప్లాస్టిక్ రహిత గుంటూరు నిర్మాణానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News