Breaking News

అమ్మ అక్షరదీపం వేల ఆశయాలకు వెలుగు

-అమ్మ అసోసియేషన్ చేయూతతో ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయండి
-అమ్మ స్ఫూర్తితో మరింత మంది స్వచ్ఛందంగా ముందుకు రండి
-పేదల జీవితాల్లో వెలుగులు నింపడంలో భాగస్వాములు కండి
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్య అనేది ఎవరూ దోచుకోలేని సంపదని.. ఒక విద్యార్థికి అందించే సహాయం ఒక కుటుంబ భవిష్యత్తును వెలిగించే దీపమని… ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) అందించే చేయూతతో విద్యార్థుల కలలకు రెక్కలు వస్తాయని భవితకు భరోసా ఇస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) ఆధ్వర్యంలో ఆదివారం నగరం లోని అమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన విద్యార్థినీవిద్యార్థులకు ఉపకార వేతనాలు, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, నోట్ పుస్తకాలను పంపిణీ చేసి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టడం అంటే దేశ భవిష్యత్తును నిర్మించడమని అన్నారు. ప్రభుత్వంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన ఉత్తీర్ణతా శాతం ఇందుకు నిదర్శనమన్నారు. ఆర్థిక పరిస్థితులు విద్యకు అడ్డంకిగా మారకుండా వివిధ పథకాల ద్వారా విద్యార్థులకు చేయూత అందిస్తూ, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను ప్రభుత్వం విస్తృతం చేస్తోందని పేర్కొన్నారు.
విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, విజ్ఞానం, సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన విజయానికి మూలస్తంభాలని, నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని అన్నారు.
అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న P4 విధానం ద్వారా పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తోందని వివరించారు. జిల్లాలో దాదాపు 70 వేల బంగారు కుటుంబాలకు 7,000 మంది మార్గదర్శులు ద్వారా చేయూత లభిస్తోందని తెలిపారు. అమ్మ సంస్థ తరహాలో ఎంతోమంది వ్యక్తిగతంగా, సంస్థల పరంగా సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కొందరు పారిశ్రామికవేత్తలు కూడా పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేయి కలుపుతున్నారన్నారు.
కుటుంబాలు ఆర్థికంగా బలపడితే పిల్లల చదువుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.
విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్షులు గారపాటి సతీష్ బాబు మాట్లాడుతూ సభ్యుల సహకారం తీసుకుని సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం విద్యార్థుల విద్యాభివృద్ధికి సహాయం అందిస్తున్నామని తెలిపారు.ఈ ఏడాది 425 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో రూ. 21.30 లక్షలు, రూ. 60 వేల విలవగల నోట్ బుక్స్ ను అందజేస్తున్నామని తెలిపారు. పీ4 కార్యక్రమం కింద విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్ధం 16 లక్షలతో విశ్రాంతి భవనం నిర్మించి మౌలిక వసతులు కల్పించామని తెలిపారు భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు చేయూత అందించే కార్యక్రమాలను విస్తరిస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి సుంకర చంద్రశేఖర్ మాట్లాడుతూ పేద విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో బోయపాటి శివరామకృష్ణయ్య నగర పాలక సంస్థ పాఠశాలను 2014 సంవత్సరంలో దత్తత తీసుకుని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న పి 4 కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి అన్నే శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు జి.వి.సుబ్బారావు, డి.దుర్గాప్రసాద్ సంయుక్త కార్యదర్శి కె.దుర్గా మల్లికార్జునరావు, కార్యవర్గ సభ్యులు టి.రమేష్ బాబు, వై.శివరామకృష్ణ, ఆర్ శ్రీనివాసరావు, పి.వెంకటరావు, సయద్ వలి భాషా, వై.శివరామ కృష్ణ, ఎన్ . సీతారామ ప్రసాద్, టి.సాంబశివరావు, బి.సుధాకర్, కె.వెంకటేశ్వర రావు, గురుజిత్ సింగ్ సహాని, రామ కోటేశ్వరరావు సభ్యులు, మాజీ కార్యవర్గ సభ్యులు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *