-ప్రత్యేక వ్యవస్థను రూపొందించిన ఆర్టీజీఎస్
-వరదల నియంత్రణకు డిజిటల్ ఎలివేషన్ మోడల్
-రెండు రోజులు ముందుగానే వర్షాలపై ముందస్తు అంచనాలు
-ఆరు గంటల ముందుగానే ఆకస్మిక వరద ముప్పును పసిగట్టే వ్యవస్థ
-వరద ప్రభావిత ప్రాంతాల్లో హాట్ స్పాట్‌ల గుర్తింపు
-ఆర్టీజీఎస్ సహకారంతో యంత్రాంగానికి ముందస్తు హెచ్చరికలు పంపనున్న ఏపీఎస్‌డీఎంఏ
-మొదట విజయవాడలో అమలు.. త్వరలో మిగిలిన పట్టణాలు, నగరాలకు విస్తరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బుడమేరు… విజయవాడ నగరానికి నిత్యం పొంచిఉన్న వరదముప్పు ఇది. ఎప్పుడు ఆకస్మిక వరదలతో నగరంపై విరుచుకుపడుతుందో తెలీని ప్రమాదకరమైన వాగు బుడమేరు. వరద ముప్పు నుంచి విజయవాడ నగరానికి శాశ్వత అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం పలురకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నగరమే కాదు ఇప్పుడు మారుతున్న వాతారవణ మార్పుల ప్రభావంతో పట్టణ ప్రాంతాల్లో వరదల ముప్పు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విపత్తులు సంభవించే ముందే వాటిని అంచనా వేసి, ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “సిటీ ఫ్లడ్ అలర్ట్” అనే సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక వ్యవస్థను పట్టణ వరదలను ముందుగానే గుర్తించి, సంబంధిత యంత్రాంగాన్ని అధికారులను అప్రమత్తం చేస్తూ సమయానుకూల చర్యలు చేపట్టడానికి దోహదపడుతుంది. ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ)తో కలిసి, ఐఐటీ గాంధీనగర్ నిపుణుల సహకారంతో ఈ సిటీ ప్లడ్ అలెర్ట్ వ్యవస్థను రూపొందించింది. కృత్రిమ మేధస్సు, ఉపగ్రహ ఆధారిత చిత్రాల విశ్లేషణ, ప్రిడిక్టివ్ అనలటిక్స్, హైడ్రోలాజికల్ మోడలింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీ మేళవింపుతో పట్టణ ప్రాంతాలకు ఖచ్చితమైన వరద అంచనాలు, ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఆర్టీజీఎస్ రూపొందించిన ఈ వ్యవస్థ ముందస్తు విపత్తు నిర్వహణకు, పట్టణాల వాతావరణానుకూల సామర్థ్య పెంపునకు కీలకంగా పనిచేస్తుంది.
ఇదో డిజిటల్ రక్షా కవచం
పట్టణాలకు పొంచి ఉన్న వరద విపత్తుల నుంచి భయటపడటానికి ఇదో డిజిటల్ రక్షాకవచంగా పనిచేస్తుంది. సిటీ ప్లడ్ అలర్ట్ వ్యవస్థకు ఉపగ్రహ చిత్రాల ఆధారంగా రూపొందించిన హై రెజల్యూషన్ డిజిటల్ ఎలివేషన్ మోడల్ కీలకంగా పని చేస్తుంది. విజయవాడ నగరానికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలు తీసుకుని, నగరంలో గత 30 సంవత్సరాల్లో వచ్చిన వరదలు, కురిసిన వర్షాలు, నగరానికి వచ్చిన నీటి పరిమాణం తదితర అంశాలతో కూడిన హిస్టారికల్ డేటాను డిజటలీకరణ చేశారు. తద్వారా నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలను, ఎక్కడ అధికంగా వర్షాలు పడొచ్చు, ఎక్కడ వరదలు రవొచ్చు, ఎక్కడ నీరు ముందుకెళ్లకుండా నిలిచిపోవచ్చు అనేదాన్ని వార్డుల వారీగా మ్యాపింగ్ చేశారు. వరద ముప్పు ఎక్కువ ఉండటానికి ఆస్కారమున్న ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించి మ్యాపింగ్ చేశారు.
ఆరు గంటల ముందుగానే అంచనా
సిటి ఫ్లడ్ అలెర్ట్ వ్యవస్థ ద్వారా భవిష్యత్తులో విజయవాడకు ఎప్పుడు ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) ఏర్పడినా దాన్ని ఆరు గంటల ముందుగానే ఈ వ్యవస్థ పసిగడుతుంది. నగరంలో వర్ష సూచనలను రెండు రోజులు ముందుగానే ఆర్టీజీఎస్ పసిగడుతుంది. భవిష్యత్తులో బుడమేరు నుంచి ఆకస్మిక వరదలు వస్తే దాన్ని ఆరు గంటలముందుగానే కృత్రిమ మేథ ద్వారా ఈ వ్యవస్థ అంచనా వేస్తుంది. ఈ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ)ఆటోమేటిగ్గా వెళ్లేలా అనుసంధానం చేశారు. ఆ సంస్థ నుంచి ఆటోమేటిగ్గా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, జిల్లా యంత్రాంగానికి, వార్డుల బాధ్యతలు చూస్తున్న అధికారుల మొబైల్ ఫోన్లకు ముందస్తు వరద హెచ్చరికలు వెళ్లిపోతాయి. దీంతో యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైన, నీరు నిలిచిపోవడానికి ఆస్కారమున్న ప్రాంతాల్లో నీరు నిలవ ఉండకుండా చేయగలుగుతారు. వరద ముప్పు ఉండబోయే ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయగులుగుతారు. అక్కడి నుంచి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించగలుగుతారు. తద్వారా ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగకుండా కాపాడగలుగుతారు.
త్వరలో అన్ని మున్సిపాల్టీలకు
ఈ సిటీ ఫ్లడ్ అలర్ట్ వ్యవస్థను ముందుగా విజయవాడ నగరంలో వరదల నియంత్రణ కోసం రూపొందించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించనున్నారు. ప్రతి నగరం, పట్టణాన్ని దీనికోసం ప్రత్యేకంగా డిజటలీకరణ చేస్తారు. ఆయా పట్టణాలు, నగరాల్లో గతంలో వచ్చిన వరదల హిస్టారికల్ డేటా ఆధారంగా విశ్లేషణ చేసి అయా ప్రాంతాల్లో వదర ముప్పు హాట్ స్పాట్లు రూపొందిస్తారు.
గుర్గావ్‌లో విజయవంతమైన వ్యవస్థ
గాంధీనగర్ ఐఐటీ నిపుణులు ఈ సిటీ ఫ్లడ్ అలెర్ట్ వ్యవస్థను గుర్గావ్ నగరంలో వరదల నివారణకు ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయం సాధించారు. దీన్ని ఫ్లడ్ అస్త్ర పేరుతో ఈ అప్లికేషన్‌ను వారు అమలు చేశారు. అదే రీతిలో విజయవాడ నగరానికి, రాష్ట్రంలోని అన్ని యూఎల్‌బీల్లోనూ సిటీ ఫ్లడ్ అలెర్టు పేరిట ఈ అప్లికేషన్‌ను అమలు చేయనున్నారు.
Prajavartha Online Telugu News