Breaking News

విద్యార్థుల సామర్థ్యాల పెంపు, క్రమబద్ధమైన అధ్యయనం, నిరంతర పునశ్చరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
-ప్రతి విద్యార్థి పురోగతిని వ్యక్తిగతంగా పర్యవేక్షించి ఉత్తీర్ణత శాతం పెంచాలి

పునాదిపాడు (కంకిపాడు మండలం), నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల సామర్థ్యాల పెంపు, క్రమబద్ధమైన అధ్యయనం, నిరంతర పునశ్చరణపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడి ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు.

సోమవారం కంకిపాడు మండలంలోని పునాదిపాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన ఆయన, ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాల విద్యా పనితీరు, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు, పదో తరగతి ఫలితాలను సమీక్షించి పలు సూచనలు చేశారు.

సోమవారం కంకిపాడు మండలంలోని పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్)ను సందర్శించిన ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాల పనితీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా పాఠశాల రేటింగ్, పదో తరగతి ఉత్తీర్ణత శాతం, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు, ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్‌మెంట్ ఫలితాలను పరిశీలించిన కలెక్టర్, ప్రస్తుత ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని అన్నారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శ్రమకు తగిన ఫలితాలు కనిపించడం లేదని పేర్కొంటూ, ఇందుకు గల కారణాలను గుర్తించి వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు.

విద్యార్థులు కష్టపడి చదువుతున్నప్పటికీ క్రమబద్ధమైన అధ్యయనం, నిరంతర పునశ్చరణ లోపించడం వల్ల నేర్చుకున్న అంశాలు నిలకడగా గుర్తుండటం లేదని అభిప్రాయపడ్డారు. ప్రతి పాఠాన్ని బోధించే ముందు ఒకసారి, బోధన సమయంలో శ్రద్ధగా, అనంతరం పునశ్చరణ చేసే అలవాటు విద్యార్థుల్లో పెంపొందించాలని సూచించారు. వారంలో బోధించిన అంశాలను ప్రతి వారాంతంలో తప్పనిసరిగా రివిజన్ చేయించి, అవగాహనను బలోపేతం చేయాలని తెలిపారు.

స్లిప్ టెస్టులు, యూనిట్ టెస్టులు నిర్వహించడం మాత్రమే కాకుండా, వాటి ఫలితాలను విశ్లేషించి ప్రతి విద్యార్థి ఏ అంశంలో వెనుకబడుతున్నాడో గుర్తించి వ్యక్తిగతంగా మార్గదర్శనం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను మూడు వర్గాలుగా గుర్తించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు బోధన, పునశ్చరణ, నిరంతర పర్యవేక్షణ ద్వారా వారిని ఉత్తీర్ణులను చేయాలని ఆదేశించారు.

మాతృభాష అయిన తెలుగులో కూడా విద్యార్థులు విఫలమవడం ఆందోళన కలిగించే అంశమని కలెక్టర్ పేర్కొన్నారు. తెలుగు భాషలో అక్షరదోషాలు, భావవ్యక్తీకరణ, రచనా నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అవసరమని చెప్పారు. విద్యార్థుల బలహీనతలను ప్రారంభ దశలోనే గుర్తించి ప్రాథమిక స్థాయి నుంచి బోధన అందిస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు.

ప్రతి ఉపాధ్యాయుడు తన సొంత పిల్లల చదువుపై చూపే శ్రద్ధతోనే వెనుకబడిన విద్యార్థుల పట్ల బాధ్యత వహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి తరగతిలో ప్రత్యేక శ్రద్ధ అవసరమైన విద్యార్థులను గుర్తించి వారిపై నిరంతర పర్యవేక్షణ, తల్లిదండ్రులతో సమన్వయం, వ్యక్తిగత మార్గదర్శనం అందిస్తే పాఠశాల ఫలితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని తెలిపారు.

పాఠశాల గత వైభవాన్ని నిలబెట్టే బాధ్యత ప్రస్తుత ఉపాధ్యాయులందరిపైనా ఉందని పేర్కొన్న కలెక్టర్, వచ్చే విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల్లో స్పష్టమైన పురోగతి కనిపించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషితో పునాదిపాడు జెడ్పీహెచ్ఎస్‌ను జిల్లాలో ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

సమావేశంలో విద్యాశాఖ ఆర్జెడి జి నాగమణి, డీఈవో యు వి సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఇఓ పద్మారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *