-తిరుపతి పార్లమెంటు పరిధిలోని కీలక రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలి
-లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత కీలకమైన రహదారి ప్రాజెక్టులను తక్షణమే చేపట్టాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాళహస్తి–తడ, గూడూరు–రాపూరు–రాజంపేట, ఊతుకొట–సత్యవేడు–తడ రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మూడు రహదారులు తిరుపతి పార్లమెంటు పరిధిలోని పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య ప్రాంతాలను అనుసంధానించే కీలక మార్గాలని ఎంపీ తెలిపారు. ముఖ్యంగా శ్రీ సిటీ, మేనకూరు సెజ్, కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానమైన ప్రాంతాల్లో రవాణా అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.
అలాగే నెల్లూరు–చెన్నై జాతీయ రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణపట్నం పోర్టు నుంచి భారీ సరుకు రవాణా, శ్రీ సిటీ, మేనకూరు సెజ్‌లలో పారిశ్రామిక కార్యకలాపాల విస్తరణ కారణంగా ఈ మార్గంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగిందని వివరించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల రహదారి పెరిగిన రవాణా అవసరాలను తట్టుకోలేకపోతోందని, దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ ఆలస్యం, రోడ్డు ప్రమాదాల ముప్పు అధికమవుతున్నాయని తెలిపారు.
పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య విస్తరణ, ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నెల్లూరు–చెన్నై జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించడంతో పాటు శ్రీకాళహస్తి–తడ, గూడూరు–రాపూరు–రాజంపేట, ఊతుకొట–సత్యవేడు–తడ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ ప్రతిపాదనలు అమలైతే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక పురోగతి, సరుకు రవాణా సామర్థ్యం, ప్రజల ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని ఎంపీ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News