-జిల్లాల వారీగా కేసీసీ జారీ, రుణాల పంపిణీ వివరాలను పార్లమెంట్‌కు సమర్పించిన కేంద్ర ప్రభుత్వం
-కిసాన్ క్రెడిట్ కార్డులపై లోక్ సభ లో ఎంపీ కేసినేని చిన్ని కీలక ప్రశ్న
-లోక్‌సభలో విజయవాడ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (KCC) జారీ, వాటి ద్వారా అందుతున్న పంట రుణాలు, సత్వర రుణ చెల్లింపు ప్రోత్సాహకాలు (Prompt Repayment Incentive – PRI), అలాగే రైతులకు అందించే రుణ పరిమితి పెంపు వంటి కీలక అంశాలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంపీ కేశినేని శివనాథ్ రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వివరాలు కోరారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యాంశాలను వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదు సంవత్సరాలుగా జిల్లా వారీగా జారీ చేసిన కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్య, రైతులకు పంపిణీ చేసిన రుణాల వివరాలను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) నివేదికల ఆధారంగా పార్లమెంట్‌కు సమర్పించినట్లు కేంద్రం తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న కిసాన్ రిన్ పోర్టల్ (KRP)లో నమోదైన సమాచారం ప్రకారం, సవరించిన వడ్డీ రాయితీ పథకం (MISS) కింద పంపిణీ చేసిన కేసీసీ రుణాలు, వాటిపై విడుదల చేసిన సత్వర రుణ చెల్లింపు ప్రోత్సాహకం (PRI) వివరాలను జిల్లా వారీగా అందించినట్లు పేర్కొంది.
2023లో కిసాన్ రిన్ పోర్టల్ ప్రారంభానికి ముందు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా PRI వివరాలు నమోదు చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రైతులకు శుభవార్త.. రూ.5 లక్షలకు పెరిగిన రుణ పరిమితి
ఎంపీ కేశినేని శివనాథ్ లేవనెత్తిన మరో కీలక ప్రశ్నకు సమాధానంగా, 2025–26 కేంద్ర బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డులపై సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం (MISS) కింద రైతులకు అందించే రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
రైతులకు తక్కువ వడ్డీతో అధిక మొత్తంలో వ్యవసాయ రుణాలు అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల అమలు, రుణాల పంపిణీ, కేంద్ర ప్రోత్సాహకాలపై పూర్తి వివరాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ, రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చొరవను రైతు సంఘాలు, వ్యవసాయ వర్గాలు అభినందిస్తున్నాయి.
Prajavartha Online Telugu News