-రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగానే వివరాలు వెల్లడించిన కేంద్రం
-క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్య
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు సురక్షితమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన పరిశుభ్రత వంటి అంశాలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై ఎంపీ చేసిన సూచనలను పరిశీలించిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాష్ట్ర ప్రభుత్వానికి వాటిని పంపగా, రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక ఆధారంగా వివరాలు వెల్లడించారు.
పీఎం పోషణ్ పథకం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో బాలవాటిక నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నామని, ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి భద్రత, వంట సిబ్బందికి శిక్షణ, భోజనం వడ్డించే ముందు రుచి పరీక్ష, ఆహార నాణ్యత పరీక్షలు వంటి అంశాలపై సమగ్ర మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.
ఎంపీ సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా, ప్రతి నెల మధ్యాహ్న భోజనంపై తనిఖీలు నిర్వహించడం, ఐఎంఎంఎస్ మొబైల్ యాప్ ద్వారా రోజువారీ పర్యవేక్షణ, తాగునీరు, ఆహార నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, గుడ్ల నాణ్యత, నిల్వ గదుల పరిస్థితిపై నిరంతర తనిఖీలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించినట్టు మంత్రి వెల్లడించారు. ప్రతి పాఠశాలలో స్కూల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేయడం, స్కూల్ సేఫ్టీ ఆడిట్లు నిర్వహించడం, ఉపాధ్యాయులు, వంట సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొన్నట్లు కేంద్రం తెలిపింది.
అయితే, కేంద్ర మంత్రి వెల్లడించిన ఈ వివరాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదిక ఆధారంగానే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్న చర్యలు అనేక పాఠశాలలు, హాస్టళ్లలో వాస్తవంగా అమలు కావడం లేదని, విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
*విద్యార్థుల ఆరోగ్యం, భద్రత వంటి అత్యంత కీలకమైన అంశాల్లో వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి కేంద్ర ప్రభుత్వానికి తప్పుదోవ పట్టించే నివేదికలు పంపడం ఆందోళనకరమని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి భద్రతపై సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం స్వతంత్రంగా సమీక్షించాలని ఆయన కోరారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News