విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్, భారత రత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా విజయవాడలోని ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీ నందు ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కలాం దేశాభివృద్ధి దృక్పథం, విజ్ఞాన శాస్త్రానికి చేసిన అపూర్వ సేవలు, యువతకు అందించిన స్ఫూర్తిదాయక సందేశాల గురించి వివరించారు. కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకునే వరకు ఆగకండి అనే డాక్టర్ కలాం సందేశాన్ని ప్రతి యువకుడు జీవిత లక్ష్యంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, డాక్టర్ కలాం దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని విశ్వసిస్తూ, విద్య, విజ్ఞానం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని నిరంతరం ప్రేరణనిచ్చారని పేర్కొన్నారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, గొప్ప గురువుగా ఆయన చేసిన సేవలు ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని, ఆయన రచనలు, ఆలోచనలు, విలువలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. పుస్తక పఠనం, శాస్త్రీయ దృక్పథం, దేశభక్తి వంటి విలువలను ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని, డాక్టర్ కలాం ఆశయాలకు అనుగుణంగా యువత తమ ప్రతిభను దేశాభివృద్ధికి అంకితం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఉమారాణి, సిబ్బంది వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి, నాగేశ్వరరావు, విద్యార్థులు, పాఠకులు పాల్గొని డాక్టర్ కలాం కి నివాళులర్పించారు.
Prajavartha Online Telugu News