విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆగస్టు 6, 7 మరియు 9 తేదీలలో “కళా ఉత్సవ్” పేరిట మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి నృత్య పోటీలు నిర్వహించనున్నారు. శివ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామి వారి దివ్య ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్, రాధాకృష్ణ కళాక్షేత్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాయని కనకదుర్గ గుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) తెలిపారు. సోమవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఈ ఉత్సవానికి సంబంధించిన బ్రోచర్ను హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులుతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సనాతన ధర్మం మరియు సాంస్కృతిక సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల నుండి సుమారు 700 మంది కళాకారులు ఎంట్రీలు పంపగా, వారిలో 250 మంది ప్రతిభావంతులను ఎంపిక చేశారు. శ్రీకాకుళం, ఆమదాలవలస నుండి చిత్తూరు వరకు, అలాగే తెలంగాణ ప్రాంతాల నుండి కూడా కళాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే కళాకారులకు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు, పూర్తిగా ఉచితం. కళాకారులందరికీ ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు, కనకదుర్గ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించబడుతుంది. ఆగస్టు 9 ఆదివారం విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తారు. పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు, మెడల్స్ ప్రధానం చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్చరల్ కో ఆర్డినేటర్స్ జి.బి. నారాయణ, సందిరెడ్డి కొండలరావు, కె.రమాసుందరి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News