-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,
-సమగ్ర శిక్ష, ఖాన్ అకాడమీ ఇండియా మధ్య ఒప్పందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో (KGBV) నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సమగ్ర శిక్ష, ప్రముఖ స్వచ్ఛంద విద్యా సంస్థ ‘ఖాన్ అకాడమీ ఇండియా’తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు.
సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ఖాన్ అకాడమీ ఇండియా గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్ అండ్ ప్రోగ్రామ్స్ హెడ్ శుభ్ర మిత్తల్, శిక్షణ విభాగం సీనియర్ మేనేజర్ సంకేత్ పాటిల్, సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డా. ఎం.ఆర్.ప్రసన్నకుమార్, కేజీబీవీ సెక్రటరీ డి.దేవానందరెడ్డి, యూనిసెఫ్ ప్రతినిధి శేషగిరి మధుసూదన్, యూనిసెఫ్ కన్సల్టెంట్ ప్రియాంక, ఏజీసీడీవో సుధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
యూనిసెఫ్ సౌజన్యంతో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా ఇంటర్మీడియట్ బోధించే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బోటనీ, జువాలజీ అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నామని తెలిపారు. ఖాన్ అకాడమీకి చెందిన కృత్రిమ మేధ (AI) ఆధారిత బోధనా సహాయక వేదిక అయిన ‘ఖాన్మిగో’ (Khanmigo) లోని ఆధునిక విద్యా కంటెంట్‌ను ఉపాధ్యాయులు బోధనలో ఉచితంగా ఉపయోగించుకోవడానికి మార్గం సుగమవుతుందని తెలిపారు.
శిక్షణా విధానం
దశల వారీగా జరిగిన ఈ శిక్షణలో టిఎం (Teacher Mentors) ల ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా సబ్జెక్టుల వారీగా సమర్థులైన టీచర్ మెంటార్లను ఐడెంటిఫై చేస్తార. మొదటి దశలో వారికి, ఆ తర్వాత మిగిలిన సబ్జెక్ట్ టీచర్లకు ఖాన్ అకాడమీ కంటెంట్‌ను ఉపయోగించి ఇంటర్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులను డిజిటల్ పద్ధతిలో ప్రభావవంతంగా బోధించడంపై సమగ్ర శిక్షణ ఇస్తారు. తద్వారా విద్యార్థులు తమ సొంత వేగంతో పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా వ్యక్తిగత అభ్యాసనం (Personalized Learning) మరియు డిజిటల్ రిసోర్సెస్ ద్వారా బోధన కొనసాగుతుంది.
ఖాన్ అకాడమీ ఇండియా గురించి
పద్మశ్రీ గ్రహీత సల్ ఖాన్ స్థాపించిన ఖాన్ అకాడమీ ప్రపంచవ్యాప్తంగా “ఎవరికైనా, ఎక్కడైనా ఉచిత, ప్రపంచ స్థాయి విద్య” అనే లక్ష్యంతో పనిచేస్తోంది. భారత్‌లో టాటా ట్రస్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పరివర్తన్, ఎస్బిఐ ఫౌండేషన్, ఇండియా మార్ట్, ఇన్ఫో ఎడ్జ్, కన్సెంట్రిక్స్, యాక్సిస్ బ్యాంక్, కాగ్నిజెంట్ ఫౌండేషన్, క్యాప్‌జెమిని, ఇంటెల్ మరియు షెల్ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో బహుభాషల్లో ఉచిత విద్యా వనరులను అందిస్తోంది.
Prajavartha Online Telugu News