-సామాన్యుడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
-బీపీటీ సూపర్ ఫైన్ కేజీ రూ.52, పచ్చి బియ్యం రూ.50లకు అందజేయడంతో సామాన్యుడికి ఊరట
-ఆగస్టు 1 నుంచి ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలి
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్యుడికి సాంత్వన చేకూర్చేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52లకు, గ్రేడ్ 1 పచ్చి బియ్యం ( రా రైస్ ) రూ.50లకు రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైసు మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, సోదరులు నాదెండ్ల మనోహర్ . సామాన్యుడిపై ధరల భారం పడకుండా కూటమి ప్రభుత్వం తరఫున ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం స్వాగతించదగినదని చెప్పారు. బహిరంగ మార్కెట్ ధరలను సమీక్ష చేసి, మిల్లర్లతో అత్యవసరంగా సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండేలా మేలైన ధరలను నిర్ణయించారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ పాలనపరమైన నిర్ణయం సామాన్య ప్రజల ఆర్థికభారాన్ని తగ్గిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
Prajavartha Online Telugu News