Breaking News

కార్పొరేట్ కంటే ఎంజేపీ సీట్లకే డిమాండ్

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం
-రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకులాల ఏర్పాటు
-ఉత్తరాంధ్రలో, రాయలసీమలో అయిదేసి చొప్పున ప్రారంభం
-6 బాలికల గురుకుల పాఠశాలలను జూనియల్ కళాశాలలుగా అప్ గ్రేడ్ : మంత్రి సవిత
-గిద్దలూరు బీసీ బాలుర గురుకుల పాఠశాల ప్రారంభం

గిద్దలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. దీనిలో భాగంగా కొత్తగా పది బీసీ గురుకులాలను ప్రారంభించామని, ఆరు బాలిక గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులాల సీట్లకు కార్పొరేట్ సీట్ల కంటే డిమాండ్ అధికంగా ఉందన్నారు. బీసీలు అధికంగా ఉన్న చోట గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిద్దలూరు పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతతో కలిసి మంత్రి సవిత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యతోనే సమాజాభివృద్ధి అని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబునాయుడు అని అన్నారు. ముఖ్యంగా బీసీలు విద్యలో రాణిస్తే అన్ని రంగాల్లోనూ ముందంజ వేయగలరని ఆయన భావన అని అన్నారు. అందుకే, రాష్ట్ర వ్యాప్తంగా ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కొత్తగా పది బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో వెనుకబడిన ఉత్తరాంధ్రలో అయిదు, రాయలసీమలో మరో అయిదు గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. దీనిలో భాగంగా గిద్దలూరులో ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో అన్ని మౌలిక సదుపాయలతో ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. రూ.50 కోట్లతో శాశ్వత భవన సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఫలితాల్లో ఎంజేపీదే అగ్రస్థానం

రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులాల్లో విద్య బోధిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. అందుకే, కార్పొరేట్ విద్య సంస్థల సీట్ల కంటే ఎంజేపీ గురుకుల సీట్లకు అధిక డిమాండ్ ఉందని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఇన్వర్టర్లు, పరిశుద్ధమైన తాగునీటికి ఆర్వో పాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దోమలు చొరబడకుండా దోమలు తెరలు తరగతి గదులు, విశ్రాంతి గదులు కిటికీలకు, తలుపులకు అమర్చుతున్నామన్నారు. విద్యతో పాటు క్రీడలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ట్రాక్ షూట్లు, బూట్లు అందజేశామన్నారు. త్వరలో స్పోర్ట్స్ కిట్లు కూడా అందజేయనున్నామని తెలిపారు. ఈ ఏడాది మే నెలలో విడుదలైన టెన్త్, ఇంటర్ లో ఎంజేపీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి, అగ్రగామిగా నిలిచారన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల షైనింగ్ స్టార్స్ పేరుతో కూడా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిందని మంత్రి సవిత గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలు అందిపుచ్చుకుని, అత్యుత్తమంగా రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంజేపీ స్కూళ్ల కార్యదర్శి మాధవీలత, గురుకుల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *