-దేశంలోనే తొలిసారి కాకినాడ జిల్లాలో అమలు
-పైలెట్ ప్రాజెక్టుగా 9 వేల మెట్రిక్ టన్నులు ప్రతి నెలా అందజేత
-ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో డిజిటల్ వాలెట్ కు శ్రీకారం
-త్వరలో చౌక డిపోల ద్వారా కందిపప్పు అందిస్తాం
-తక్కువ ధరకే 70 సరకులతో 1000 మీ మార్టులు
-ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు
-బాయిల్ట్ రైస్ ధాన్యం సేకరణ కోటా మరో 20 వేల మెట్రిక్ టన్నుల పెంపు
-రూ.281 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
-సగర్వంగా చెప్పుకొనేలా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ పనితీరు
-రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖా నాదెండ్ల మనోహర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘చౌకధరల డిపో ద్వారా అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని ప్రజలు ఎందుకు పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు..? ప్రతి కేజీ మీద రూ.56 మేర రాయితీని వెచ్చిస్తుంటే ఆ బియ్యం ప్రజలకు ఎందుకు అక్కరకు రాకుండాపోతున్నాయి..? అనే విషయం మీద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ లోతుగా అధ్యయనం చేసింది. నిపుణులు, ఆర్థికవేత్తలు, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత ప్రజా పంపిణీలో ఇప్పుడు అందిస్తున్న బియ్యం స్థానంలో, ప్రజలు ఆసక్తి చూపిస్తున్న స్టీమ్ రైస్ అందిస్తే వినియోగం పెరుగుతుందని గుర్తించామ’ని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతుందని, బియ్యం పక్కదారి పట్టడం తగ్గుతుందని చెప్పారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన ఢిల్లీలో ఆంధ్ర భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ… ‘‘రాష్ట్రంలో స్టీమ్ రైస్ అందించే ప్రయోగాన్ని రాష్ట్రంలోని 42 వేల పాఠశాలలు, 4 వేల వసతి గృహాల్లో అమలు చేశాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో రాష్ట్రవ్యాప్తంగా స్టీమ్ రైస్ అందిస్తూ, నాణ్యమైన భోజనం పిల్లలకు అందిస్తున్నాం. దీనికి రైతులు తగిన విధంగా సహకరించి 2.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎలాంటి అధిక బోనస్ లు ఆశించకుండా మాకు అందించారు. ఈ విషయాన్ని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి తీసుకెళ్లినపుడు, ప్రజా పంపిణీలో కూడా స్టీమ్ రైస్ పంపిణీ చేయాలని మేం కోరినపుడు మంత్రివర్యుల దగ్గర నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఓ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అమలు చేస్తామని చెప్పినపుడు కచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
కాకినాడ జిల్లాతో మొదలు
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో దేశంలోనే తొలిసారి కాకినాడ జిల్లాలో చౌక డిపోల్లో నాణ్యమైన స్టీమ్ రైస్ బియ్యాన్ని అందజేయాలని నిర్ణయించాం. ప్రజా పంపిణీ ద్వారా ప్రతి రైసు కార్డుదారుడికి, అలాగే పాఠశాలలు, హాస్టల్స్ కు కలిపి జిల్లాకు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయని అంచనా వేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ఫలితాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా స్టీమ్ రైస్ ను చౌకడిపోల్లో అందించేలా ప్రణాళికతో ముందుకు వెళ్తాం. దీంతోపాటు రైతాంగం నుంచి వచ్చిన అభ్యర్థనలను కేంద్ర ప్రభుత్వ అధికారుల వద్ద ప్రస్తావించినపుడు బాయిల్ట్ రైస్ ధాన్యం కోటాను మరికొంత పెంచడానికి అంగీకరించారు.
గతంలో ఢిల్లీలో పర్యటించినపుడు మొట్టమొదటిసారి రాష్ట్రానికి అనువుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్ట్ రైస్ ధాన్యం సేకరణకు అంగీకరించారు. ఇప్పుడు దానికి అదనంగా మరో 20 వేల మెట్రిక్ టన్నుల సేకరణకు ఒప్పుకున్నారు. ప్రతి గింజను రైతు దగ్గర నుంచి కొంటామని ఇచ్చిన మాటను పూర్తిగా నెరవేరుస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మార్మోగుతుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పనితీరును ఢిల్లీలో సగర్వంగా చెప్పుకొనే స్థితికి తీసుకురాగలిగాం. నాణ్యమైన సరకులు, మేలైన సేవలు, లాజిస్టిక్స్, రవాణాలో పారదర్శకత, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భేష్ గా నిలిచి దేశంలోనే రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ నిలుస్తోంది. హోల్ సేల్ ధరలకు నిత్యావసర సరకులు అందించే మార్టులతో పోటీపడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మీ మార్టు’లను ఈ త్రైమాసికంలోనే ప్రారంభిస్తాం. 1000 మార్టులను జిల్లాల వారీగా అవసరం ఉన్న చోట ప్రారంభిస్తాం. దీనిపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఎన్.సి.సి.ఎఫ్. మధ్య ఒప్పందం కుదిరింది. మీ మార్టుల్లో అతి తక్కువ ధరకే సరకులు లభిస్తాయి. 70 రకాల సరకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం
సామాన్యుడికి ధరల భారం పెరగకుండా, ధరల స్థిరీకరణకు కట్టుబడి ఉన్నాం. గత రెండు నెలలుగా రాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్యుడు పడుతున్న ఇబ్బందులను మేం గుర్తించాం. దీంతో ఆగస్టు 1 వ తేదీ నుంచి రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక అవుట్ లెట్ల ద్వారా బహిరంగ మార్కెట్లో రూ. 62 నుంచి రూ.64లు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్ ను రూ.52లకు, బహిరంగ మార్కెట్లో రూ.58లు ధర ఉన్న గ్రేడ్ 1 రా రైస్ ను రూ.50లకు అందించాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో సేకరించి ఎఫ్.సి.ఐ. గోదాముల్లో భద్రపరిచిన స్వర్ణ వెరైటీ రకం బియ్యం లక్ష టన్నుల మేర నిల్వ ఉంది. దాన్ని కూడా వాడుకునేలా కేంద్ర మంత్రివర్యులను అనుమతి అడిగాం. ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో వచ్చే రోజుల్లో స్వర్ణ వెరైటీ రకం బియ్యాన్ని కూడా రైతు బజార్ల ద్వారా రూ.40లకే అందించాలని భావిస్తున్నాం. దీంతోపాటు రాష్ట్రానికి 73 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం అని కేంద్ర మంత్రి దగ్గర ప్రస్తావించాం. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 30 వేల చౌకధరల దుకాణాల్లో బియ్యం, పంచదారతో పాటు నాణ్యమైన కందిపప్పును ప్రతి కార్డుదారుడికి 500 గ్రాముల మేర అందించే ఏర్పాట్లు చేస్తాం. దీంతో పాటు రాష్ట్రానికి 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి రావాల్సిన కేంద్ర నిధులు రూ.281 కోట్లను వెంటనే చెల్లించేలా కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి బ్యాగు మీద క్యూఆర్ కోడ్ ఇప్పటి వరకు అమలు చేశాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ అధికారులు వేగం, నిర్దుష్ట సమాచారం వచ్చేలా రూపొందించిన ఆర్.ఎఫ్.ఐ.డి. విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. మొదటగా రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు అమలు చేయాలని సూచించారు. దీన్ని కూడా రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో మొదట ప్రవేశపెట్టి, అక్కడి ఫలితాలను పరిశీలిస్తాం. బియ్యం రైసు మిల్లర్ల వద్ద ప్యాకింగ్ అయ్యే దగ్గర నుంచి వినియోగదారుడికి అందే వరకు ట్రేస్ అండ్ ట్రాకింగ్ పకడ్భందీగా ఈ విధానంలో అమలయ్యేలా చూస్తాం. ఆర్.ఎఫ్.ఐ.డి. టాగ్స్ విప్లవాత్మక నిర్ణయంగా నిలిచిపోతుంది. ఇటీవల గుజరాత్ లో పర్యటించినపుడు గాంధీనగర్, అహ్మదాబాద్ లోని ప్రజా పంపిణీలో అమలు అవుతున్న సీబీడీసీ విధానాన్ని పరిశీలించాం. దాన్ని రాష్ట్రంలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని భావిస్తున్నాం. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రాయితీని డిజిటల్ వాలెట్ గా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే, వారికి అవసరం అయిన సరకులను వారు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది వారికి ఆర్థికంగానూ తోడ్పాటునిస్తుంది. ఈ విధానం మీద రకరకాల అపోహలు, ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. సాంకేతికత వేగం పుంజుకుంటున్న సమయంలో పారదర్శక మార్పులను స్వాగతించాలి. దీంతోపాటు చౌకడిపోల డీలర్లకు కూడా కమీషన్ పెరిగేలా, డిజిటల్ వాలెట్ డబ్బులు ప్రజలు వాడుకోగానే కమీషన్ పడేలా కేంద్రం చొరవ తీసుకుంటోంది. వారు అనవసర ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని చెప్పారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News