Breaking News

ఏలేరు ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీరు

-ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సాగు నీటి విడుదలకు ఏర్పాట్లు
-ఆయకట్టు చివరి భూములకు నీరందేలా కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు
-పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నిరంతరాయంగా నీటి విడుదల
-పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో 53 వేల ఎకరాల ఆయకట్టుకు జీవం
-అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
-రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా జిల్లా స్థాయి హెల్ప్‌లైన్ నంబర్
-ఏలేరు ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని తెలిపిన పవన్ కళ్యాణ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలేరు కాలువ కింద ఉన్న పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలోని 53 వేల ఎకరాల ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణ కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1000 క్యూసెక్కుల సాగు నీటి విడుదల చేసే దిశగా ప్రత్యేక సాగునీటి సలహా సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏలేరులో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకొని నీటి విడుదలకు సిద్ధమవుతారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఇరిగేషన్ ఈఎన్‌సీ కె. నరసింహమూర్తి, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్.సునీల్, గోదావరి ప్రాజెక్ట్ చైర్మన్ వీరబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరై ఖరీఫ్ సాగునీటి విడుదలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏలేరు ఆయకట్టు కింద ఉన్న రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా 1000 క్యూసెక్కుల సాగునీటి విడుదలకు క్యాలెండర్ సిద్ధం చేశారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 13 వేలకుపైగా ఎకరాలకు పూర్తి స్థాయిలో, నిరంతరాయంగా సాగునీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆయకట్టు చివరి పంట భూములకు సైతం నీరందేలా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో రూ. 2 కోట్లకు పైగా వెచ్చించి యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. రైతుల సహాయార్థం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ ‌(9849903879)ను అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేశారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు కృషి చేయాలని సమావేశం సూచించింది.
• ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలి
సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. నీటిపారుదల శాఖ, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు స్థానిక నాయకత్వంతో కలిసి నీటి వినియోగదారుల సంఘాలు, రైతులకు ఎల్‌నినో పరిస్థితులు, నీటి లభ్యత, సాగు చేయాల్సిన పంటలపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఏలేరు ఆయకట్టు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. రైతులంతా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకొనేలా చూడాలని, క్రాప్ ఇన్సూరెన్స్ ఆవశ్యకతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *