-ప్రాధాన్య వ్యాధుల గుర్తింపుపై అన్ని శాఖల ఉమ్మడి చర్చ
-నిఘా, పరీక్షలు, అత్యవసర స్పందన బలోపేతంపై సిఫారసులు
-విజయవాడలో మూడు రోజుల ‘వన్ హెల్త్’ కార్యశాల ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులను ముందుగానే గుర్తించి, వాటి వ్యాప్తిని అడ్డుకునేందుకు సమగ్ర రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజారోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగించే జూనోటిక్ వ్యాధులను గుర్తించి, వాటి నివారణ, నిఘా, పరీక్షలు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ ప్రణాళికలో చేర్చనున్నారు.
ఈ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం మూడు రోజుల ‘వన్ హెల్త్ జూనోటిక్ వ్యాధుల ప్రాధాన్యత నిర్ధారణ–రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక అభివృద్ధి’ కార్యశాల ప్రారంభమైంది. జూలై 30 వరకు జరిగే ఈ కార్యశాలను కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం సహకారంతో నిర్వహిస్తున్నారు. అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం సాంకేతిక సహకారం అందిస్తుండగా,జాన్స్ ఆప్కిన్స్ ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ గైనకాలజీ అబిస్ట్రిక్స్(జెహెచ్ పిఐఇజిఓ) కార్యశాల నిర్వహణకు తోడ్పడుతోంది.
ఆరోగ్య, పశుసంవర్ధక, అటవీ, పర్యావరణ, వ్యవసాయ, మత్స్య శాఖల అధికారులు, వైద్య–పశువైద్య నిపుణులు, విద్యాసంస్థలు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు కలిసి రాష్ట్రంలో ముందుగా నియంత్రించాల్సిన వ్యాధులపై చర్చించారు. ఒక్కో వ్యాధి తీవ్రత, వ్యాప్తి అవకాశం, ప్రజలకు కలిగే ముప్పు, అందుబాటులో ఉన్న నివారణ సదుపాయాలను పరిశీలించి ప్రాధాన్య క్రమం నిర్ణయించనున్నారు.
బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్నజీవుల ద్వారా వ్యాపించే 45 రకాల వ్యాధులను ప్రాథమిక జాబితాలో పరిశీలించారు. స్క్రబ్ టైఫస్, మెలియోయిడోసిస్, ఆంత్రాక్స్, హిస్టోప్లాస్మోసిస్, డెంగీ, జికా, ఎల్లో ఫీవర్, కొవిడ్-19, రేబిస్ తదితర వ్యాధులపై నిపుణులు అభిప్రాయాలు వెల్లడించారు.
మనుషులు, జంతువుల్లో వ్యాధులను ముందే గుర్తించేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, పరీక్షా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచడం, వ్యాధి బయటపడిన వెంటనే అన్ని శాఖలు కలిసి స్పందించడం, సమాచారాన్ని వేగంగా పంచుకోవడం, అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేయడంపై సూచనలు చేశారు. వైద్యులు, పశువైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, గ్రామస్థాయిలో అవగాహన, ప్రజల భాగస్వామ్యం పెంచడంపైనా చర్చించారు.
పశుసంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ దామోదర్ నాయుడు, డాక్టర్ సుకర్మ ఎస్.ఎస్. తన్వర్, ఎన్ సిడిసీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జితేష్ కువటాడ, ఫబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీందర్ పాల్ సింగ్ ,
విజయవాడ ప్రభుత్వ సిద్దార్థ మెడికల్ కాలేజ్ మైక్రోబయాలజీ హెచ్వోడీ డాక్టర్ ప్రశాంతి, వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆనంద్, ఇతర మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు కార్యశాలకు హాజరయ్యారు. వ్యాధి నియంత్రణ కార్యక్రమం అదనపు సంచాలకురాలు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి మాట్లాడుతూ జూనోటిక్ వ్యాధుల నివారణకు శాఖల సమన్వయం అత్యవసరమన్నారు. మూడు రోజుల చర్చల అనంతరం ప్రాధాన్య జూనోటిక్ వ్యాధుల జాబితాను ఖరారు చేసి, నివారణ, నిఘా, పరీక్షలు, అత్యవసర స్పందన, శిక్షణ, ప్రజలకు సమాచారం, శాఖల సమన్వయంపై సిఫారసులు రూపొందిస్తారు. వాటి ఆధారంగా రాష్ట్ర ‘వన్ హెల్త్’ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం కానుంది.
Prajavartha Online Telugu News