Breaking News

పెదపెంకి అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి

-క్వాలిటీ కంట్రోల్ అధికారుల నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్‌పై చర్యలకు ఆదేశం
-సంబంధిత రోడ్ల బిల్లులు నిలిపివేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి
-పెదపెంకిలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచన

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత పనుల బిల్లులను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెదపెంకి గ్రామంలో నిర్మించిన కొన్ని సిమెంట్ రోడ్లలో పగుళ్లు ఏర్పడిన విషయం ఆయన దృష్టికి వచ్చింది. ఈ అంశంపై రాష్ట్ర స్థాయి చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారిని పెదపెంకి గ్రామానికి పంపించి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. తనిఖీల్లో ఐదు సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఈ సందర్భంగా పెదపెంకిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌తో పాటు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెదపెంకిలో చేపట్టిన రోడ్లు, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పెదపెంకిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక శాసనసభ్యులు కూడా తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *