-బ్రెయిన్ డెడ్ దాతలే వేలాది మందికి ఆశాకిరణం
-దేశంలో ఆరో స్థానానికి ఏపీ.. గత ఏడాది 93 మంది దాతలతో 301 అవయవ మార్పిడులు
-ఈ ఏడాది ఇప్పటివరకు 56 మంది నుంచి అవయవాల సేకరణ
-ఆగస్టు 3 అవయవదాన దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం చర్చించాలి
-మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు
-రేపు జీవన్ ధాన్ ఆధ్వర్యంలో వైజాగ్ లో ప్రత్యేక కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం వేలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. జీవన్‌దాన్ తాజా గణాంకాల ప్రకారం 2026 జూలై 1 నాటికి మొత్తం 5,839 మంది వివిధ అవయవాల కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. వీరిలో అత్యధికంగా మూత్రపిండాలు, కాలేయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి బ్రెయిన్ డెడ్ (మెదడు మరణం) చెందిన వ్యక్తుల కుటుంబాలు తీసుకునే అవయవదాన నిర్ణయమే కొత్త జీవితం ప్రసాదిస్తోంది. రాష్ట్రంలో బ్రెయిన్ డెడ్ దాతల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతుండటంతో అవయవ మార్పిడి సేవలు కూడా విస్తరిస్తున్నాయి. గత ఏడాది 93 మంది బ్రెయిన్ డెడ్ దాతల ద్వారా ఏకంగా 301 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగి జీవన్‌దాన్ చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచాయి. వైజాగ్ లో అవయవ దానంపై జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరగనుoది. ఈ కార్యక్రమoలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ పాల్గొనున్నారు
రికార్డు దిశగా అవయవదానం
రాష్ట్రంలో బ్రెయిన్ డెడ్ దాతల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2023లో 41 మంది దాతలు నమోదు కాగా, 2024లో 66 మందికి, 2025లో రికార్డు స్థాయిలో 93 మందికి చేరింది. ఈ ఏడాది జూలై 24 నాటికే 56 మంది దాతలు నమోదయ్యారు. ఈ పురోగతితో బ్రెయిన్ డెడ్ అవయవదానంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆరో స్థానం సాధించింది. గతంలో కేవలం మూడు ఆసుపత్రుల్లో మాత్రమే అవయవ మార్పిడి సేవలు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
గతంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకే ఎక్కువగా పరిమితమైన ఈ సేవలు ఇప్పుడు విజయవాడ, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు విస్తరించాయి. ముఖ్యంగా విజయవాడ పరిధిలో బ్రెయిన్ డెడ్ దాతల నుంచి జరిగిన మూత్రపిండ మార్పిడులు 2024లో ఎనిమిది మాత్రమే ఉండగా, 2025లో 42కు పెరిగాయి
మూత్రపిండాలకే అధిక డిమాండ్
జీవన్‌దాన్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారిలో అత్యధికంగా మూత్రపిండాల కోసం ఎదురుచూస్తున్నవారే ఉన్నారు.
మూత్రపిండాలు – 3,715 మంది
కాలేయం – 2,009 మంది
గుండె – 96 మంది
ఊపిరితిత్తులు – 15 మంది
క్లోమగ్రంథి – 4 మంది
బ్లడ్ గ్రూపుల వారీగా చూస్తే ‘ఓ’ గ్రూప్‌కు చెందిన 2,600 మంది, ‘బి’ గ్రూప్ 1,721 మంది, ‘ఏ’ గ్రూప్ 1,179 మంది, ‘ఏబి’ గ్రూప్ 339 మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఒక్క నిర్ణయం… 8 మందికి జీవితం
జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి కుటుంబం అవయవదానంపై చర్చించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. “బ్రెయిన్ డెడ్ అంటే మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయిన పరిస్థితి. ఇది కోమాతో పూర్తిగా భిన్నం. కోమా నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి తిరిగి కోలుకునే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితిలో కుటుంబం తీసుకునే అవయవదాన నిర్ణయం గరిష్ఠంగా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడుతుంది. ప్రస్తుతం 5,839 మంది దాతల కోసం నిరీక్షిస్తున్నారు. అందుకే ప్రతి కుటుంబం ముందుగానే అవయవదానంపై అవగాహన పెంచుకుని నిర్ణయం తీసుకోవాలి.
దాతల కుటుంబాలకు ప్రస్తుతం రూ.10 వేలను అంత్యక్రియల కింద ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్నాం.
అదనoగా సదరు కుటుంబాల త్యాగాన్ని ఎలా గుర్తించాలన్న దానిపై పరిశీల చేస్తున్నాం” అని మంత్రి చెప్పారు.
పూర్తిగా పారదర్శక విధానం
“అవయవాల కేటాయింపులో ఎలాంటి సిఫార్సులు, పలుకుబడి లేదా దళారీలకు అవకాశం లేకుండా జీవన్‌దాన్ కేంద్రీకృత డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోంది. రోగి నమోదు చేసిన తేదీ, వ్యాధి తీవ్రత, కణజాల సరిపోలిక వంటి ప్రమాణాల ఆధారంగానే అవయవాలను కేటాయిస్తున్నాం” అని చీఫ్ ట్రాన్సప్లాంటేషన్ ఆఫిసర్ డాక్టర్ మన్మధరావు చెప్పారు.
Prajavartha Online Telugu News