-చరిత్రను అబద్ధాలతో మార్చలేరు జగన్!!
-ఐదేళ్లు అడ్డుపడి… ఇప్పుడు క్రెడిట్ కోసం దుష్ప్రచారo చేస్తారా!
-పనులు నిలిపేసి.. ప్రారoభ ఘనత మాదేనని ఎలా అంటారు?
-శంకుస్థాపనలతో కాలక్షేపం చేసిన వైకాపాకు బోగాపురం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
-రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజo
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని ఉత్తరాంధ్ర అభివృద్ధికి తీవ్ర అన్యాయం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇప్పుడు అదే ప్రాజెక్టు పూర్తవుతున్న వేళ క్రెడిట్ కోసం అబద్ధాల ప్రచారానికి దిగడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో భోగాపురం విమానాశ్రయం శరవేగంగా పూర్తవుతుండగా, వైకాపా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
భోగాపురం విమానాశ్రయంపై వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ మంత్రి గురువారం విడుదల చేసిన ప్రకటనలో జగన్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
రూపకల్పన చంద్రబాబు… ఆటంకాలు జగన్…
2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో భోగాపురం విమానాశ్రయానికి రూపకల్పన చేసి, భూసేకరణ పూర్తి చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ నుంచి అవసరమైన పర్యావరణ, విమానయాన అనుమతులన్నీ సాధించారని మంత్రి గుర్తుచేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును నిలిపివేసి, కోర్టు వివాదాల్లోకి నెట్టిందన్నారు. ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేయడమే కాకుండా, ప్రాజెక్టు పరిమాణాన్ని కుదించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి తీవ్ర నష్టం కలిగించిందని విమర్శించారు. “ఆ రోజే పనులు కొనసాగి ఉంటే భోగాపురం విమానాశ్రయం మూడేళ్ల క్రితమే ప్రజలకు అందుబాటులోకి వచ్చేది కాదా?” అని ప్రశ్నించారు.
ఇతరుల కష్టానికి రంగులు పూయడమే వైకాపా పని
అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేసే సామర్థ్యం లేకపోయినా, ఇతరులు నిర్మించిన ప్రాజెక్టులకు తమ ముద్ర వేయడం వైకాపా నాయకులకు అలవాటుగా మారిందని సత్యకుమార్ విమర్శించారు. చంద్రబాబు వేసిన పునాదిపై, ప్రధాని మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం రికార్డు వేగంతో పనులు పూర్తి చేస్తుంటే, దానిని తమ ఘనతగా చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనన్నారు. “పనులు ఆపింది మీరే… పూర్తవుతుంటే ఘనత మాదేనని చెప్పడం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట” అని మండిపడ్డారు.
మళ్లీ పట్టాలెక్కించింది కూటమి ప్రభుత్వమే
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి నిలిచిపోయిన పనులను వేగవంతం చేశారని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారంతో భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం గేమ్‌చేంజర్‌గా నిలవనుందని పేర్కొన్నారు. “వీడియోలు కత్తిరించి ప్రచారం చేసినా, అబద్ధాలు పదేపదే చెప్పినా చరిత్ర మారదు. భోగాపురం ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? ఎవరు ఐదేళ్లు నిలిపేశారు? ఎవరు మళ్లీ వేగవంతం చేసి పూర్తిచేస్తున్నారు? అన్నది ఉత్తరాంధ్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. శంకుస్థాపనలతో కాలం గడిపిన వైకాపాకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ప్రజలు వాస్తవాలను గుర్తుంచుకుంటారు… అబద్ధపు ప్రచారాలను కాదు” అని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News