-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – రీబౌండ్ గ్రూప్ గ్లోబల్ లిమిటెడ్, (ఆస్ట్రేలియా), ఆస్ట్రేలియా ప్రభుత్వం సంయుక్త సహకారంతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం పై విజయవాడ జీడీఈటీ స్కూల్లో ‘డింపుల్’ పైలట్ యాప్ ఆవిష్కరణ
-డింపుల్ డిజిటల్ ప్లాట్ ఫాం ను ఆవిష్కరించిన ఆస్ట్రేలియా సహాయక విద్యా శాఖ మంత్రి జూలియన్ హిల్, ఉన్నత విద్య కమిషనర్ శ్రీ భరత్ గుప్తా ఐఏఎస్, ఉన్నతాధికారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భావోద్వేగ పరిస్థితిని మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రీబౌండ్ గ్రూప్ గ్లోబల్ లిమిటెడ్ (ఆస్ట్రేలియా), ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారంతో రూపొందించిన ‘డింపుల్ (DIMPLE)’ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ను రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ గా శనివారం విజయవాడలోని జీడీఈటీ హైస్కూల్, పటమటలో ప్రారంభించారు.
వినూత్న కార్యక్రమాలు అమలు చేయడానిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పూడూ ముందుంటుంది – ఉన్నత విద్య కమీషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఐఏఎస్
ఈ సందర్భంగా ఉన్నత విద్య కమీషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఐఏఎస్, మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ను ఒకే శాఖ(HRD) పరిధిలో సమన్వయం చేస్తూ విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ & ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల సమీకరణ, ఉపాధ్యాయుల నియామకాలు, శిక్షణలు, విద్యా వ్యవస్థ ఆధునీకరణ వంటి పలు సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. డింపుల్ పైలట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాల నేపథ్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అన్నారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను సమీక్షించి, విద్యార్థులకు ఎంత మేర ఉపయోగపడుతుందో పరిశీలించి తదుపరి విస్తరించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చొరవ అభినందనీయం”
“ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యం కావడం గర్వకారణం” – జూలియన్ హిల్
ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన జూలియన్ హిల్ ఎంపీ, ఆస్ట్రేలియా ప్రభుత్వ సహాయక మంత్రి (సిటిజన్‌షిప్, కస్టమ్స్ & మల్టీకల్చరల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యతో పాటు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను, చూపుతున్న శ్రద్ధను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మంత్రి జూలియన్ హిల్ మాట్లాడుతూ, విద్యార్థుల జీవితంలో విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ఎంతో అవసరమని అన్నారు. టెక్నాలజీ ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, సోషల్ మీడియా వంటి వేదికలు కొన్నిసార్లు విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయన్నారు. అలాంటి పరిస్థితుల్లో టెక్నాలజీని విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడేలా వినియోగించడం ఎంతో ముఖ్యం అన్నారు, ఈ విషయంలో రీబౌండ్ గ్రూప్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం ఆస్ట్రేలియా ప్రభుత్వానికి గర్వకారణమని హిల్ తెలిపారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసమే డింపుల్ రీబౌండ్ గ్రూప్ వ్యవస్థాపకలు, సీఈఓ టాడ్ కింగ్
రీబౌండ్ గ్రూప్ వ్యవస్థాపకలు, సీఈఓ టాడ్ కింగ్ మాట్లాడుతూ, డింపుల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రెండు నుంచి మూడు సంవత్సరాలపాటు విస్తృత పరిశోధన అనంతరం అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుకుంటూ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం పొందడంతో పాటు అవసరమైతే మెంటల్ హెల్త్ కౌన్సిలర్లతో కూడా సురక్షితంగా, గోప్యంగా సంప్రదించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సేవలు విద్యార్థులకే కాకుండా భావోద్వేగ,మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వారికి కూడా ఉపయోగపడేలా రూపొందించామన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి టెక్నాలజీని వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలుస్తోందని, ఇక్కడ ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో భారతదేశంతో పాటు దక్షిణాసియా దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రతినిధులు సిలై జాకీ (కాన్సులేట్ జనరల్), కెమెరాన్ గ్రీన్ (చీఫ్ ఆఫ్ స్టాఫ్), డాక్టర్ డామియన్ ఒలివర్ (యాక్టింగ్ ఫస్ట్ అసిస్టెంట్ సెక్రటరీ), జార్జ్ థివియోస్ (మినిస్టర్ కౌన్సిలర్), స్టీవెన్ బిడిల్ – (రీజినల్ డైరెక్టర్, హోం అఫైర్స్ సౌత్ ఆసియా), జానకి శ్రీరామ్( కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, సిడ్నీ, ఆస్ట్రేలియా), కార్తికేయన్ వైతీశ్వరన్, ప్రియా రాజా పాల్గొన్నారు.
విద్యాశాఖ అధికారులు, ఎం.వి. కృష్ణారెడ్డి ( డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ), కె.నాగేశ్వరరావు( శామో అడిషనల్ డైరెక్టర్) జి.నాగమణి ( ఆర్జేడీ, కాకినాడ), ఎల్. చంద్రకళ (డీఈఓ, ఎన్టీఆర్ జిల్లా), ఆర్. రమేష్ బాబు( ఏపీసీ, సమగ్ర శిక్ష), పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News