-పీజీఆర్ఎస్‌లో 189 వినతుల స్వీకరణ
-పెండింగ్ అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
-ప్రతి అర్జీదారుతో మాట్లాడిన తర్వాతే నివేదికలు ఇవ్వాలి
-భూ, సర్వే సమస్యలు, ఎరువుల పంపిణీ, ఫార్మ్ పాండ్స్ పనులపై జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ పేర్కొన్నారు.
విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 189 వినతులు నమోదు కాగా, అందులో అత్యధికంగా 78 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవని తెలిపారు. ప్రజల నుండి అందిన ప్రతి వినతిని నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రత్యేక ప్రాధాన్యతతో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యలపై స్పందన వేగవంతమైతేనే ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుందని అన్నారు. జిల్లాలో భూ వివాదాలు, సర్వే సమస్యలు, రెవెన్యూ అంశాలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నందున సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్ పోర్టల్‌ను నిరంతరం పరిశీలిస్తూ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ 1100 టోల్ ఫ్రీ సేవ ద్వారా అందుతున్న ఫిర్యాదులను అత్యంత బాధ్యతతో పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి అర్జీదారుతో నేరుగా మాట్లాడిన అనంతరమే ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల్లో 1100 సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తును కూడా నిర్లక్ష్యం చేయరాదన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను సక్రమంగా పరిష్కరించకపోవడం వల్ల ఒకే సమస్యపై పలుమార్లు అర్జీలు వస్తున్నాయని పేర్కొంటూ, నాణ్యమైన పరిష్కారాలపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. గత నవంబర్, డిసెంబర్ నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న భూ సర్వేలను వాతావరణం అనుకూలించిన వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో ప్రజల నుంచి అధిక సంఖ్యలో అర్జీలు కలెక్టరేట్‌కు రావడం స్థానిక స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారం సరిగా జరగడం లేదనే విషయాన్ని సూచిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం మండలాల వారీగా గ్రీవెన్స్ పరిష్కారాన్ని నిరంతరం సమీక్షిస్తోందని, ఆర్‌డీవోలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భూమి సరిహద్దులు, రికార్డులు లేదా భూ హక్కులకు సంబంధించిన ప్రతి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని, సమస్య చిన్నదైనా అత్యున్నత ప్రాధాన్యతతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలంలో ఎరువుల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఎరువుల దుకాణాలు, సహకార సంఘాలు ఉదయం 6.00 గంటలకే ప్రారంభం కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కువ మంది రైతులు వచ్చే కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేసి నీడతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రతి ఎరువుల దుకాణం, సొసైటీ వద్ద ధరల పట్టికతో పాటు కలెక్టరేట్ ఫోన్ నంబర్‌ను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. డివిజనల్ రెవెన్యూ అధికారులు, తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ ఎరువుల విక్రయాలను పర్యవేక్షిస్తూ అక్రమాలు, డైవర్షన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాల పెరుగుదలకు ఫార్మ్ పాండ్స్ కీలకమని పేర్కొన్న కలెక్టర్, వర్షాకాలం ప్రారంభమైనందున మంజూరైన అన్ని ఫార్మ్ పాండ్స్ పనులను ప్రతి మండలంలో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే నెల రోజుల పాటు ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు ఈ పనులను ప్రతిరోజూ పర్యవేక్షించి వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ఆత్కూరు గ్రామానికి చెందిన కౌలు రైతులు సాగుదారు హక్కు పత్రాలు (CCRC కార్డులు) అందలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీ-సర్వే ప్రక్రియకు సీసీఆర్‌సీ కార్డుల పంపిణీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, సంబంధిత రైతులకు ఈరోజే సీసీఆర్‌సీ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, రీ-సర్వే ప్రక్రియ వేరుగా కొనసాగుతుందని, సాగుదారు హక్కు కార్డుల మంజూరులో ఎలాంటి ఆలస్యం ఉండదని వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహ, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి. జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News