-పార్లమెంట్లో భగీరథ్ చౌదరి కీలక సమాధానం
-ఏపీ లో నాలుగు వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు గుర్తింపు…
-ఏ. పి. కి ఐదేళ్లలో రూ.56.11 కోట్ల కేంద్ర సాయం
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల భాగస్వామ్యం, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, ఆధునిక పాఠ్యాంశాల అమలు, కేంద్రం అందిస్తున్న నిధుల వివరాలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి సమగ్ర లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశవ్యాప్తంగా వ్యవసాయ విద్యను *జాతీయ విద్యా విధానం (NEP–2020)*కు అనుగుణంగా ఆధునీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్‌లు, సంయుక్త పరిశోధనలు, అధ్యాపకుల పరస్పర మార్పిడి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా పాఠ్యాంశాల రూపకల్పన వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని వెల్లడించారు.
1,902 ఇండస్ట్రీ–అకాడమియా ఒప్పందాలు
దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య ఇప్పటికే 1,902 అవగాహన ఒప్పందాలు (MOU) అమలులో ఉన్నాయని కేంద్ర మంత్రి భగీరథ్ చౌదరి వెల్లడించారు. వీటి ద్వారా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన అవకాశాలు, పరిశ్రమల్లో ప్రత్యక్ష అనుభవం లభిస్తోందని వివరించారు.
ఏపీ లో నాలుగు విశ్వవిద్యాలయాలకు కేంద్ర గుర్తింపు
చిన్ని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, దేశంలోని 80 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 6వ డీన్స్ కమిటీ సిఫార్సులు అమలవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (గుంటూరు), డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కూడా ఉండటం రాష్ట్రానికి విశేష ప్రాధాన్యం దక్కినట్లుగా నిలిచింది.
ఏపీకి రూ.56.11 కోట్ల కేంద్ర సాయం
వ్యవసాయ విద్యా సంస్థల్లో ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా నాణ్యత పెంపు కోసం గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.56.11 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి భగీరథ్ చౌదరి వెల్లడించారు. ఇదే కాలంలో దేశవ్యాప్తంగా రూ.1,679.13 కోట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు.
నైపుణ్యాలకు ప్రాధాన్యం
ఈ చర్యల ఫలితంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, పరిశోధన ఫలితాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.
Prajavartha Online Telugu News