-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా బీసీ రక్షణ చట్టం తుది రూపు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విజయవాడలోని ఓ హోటల్ లో కీలక సమావేశం బుధవారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దీనిలో భాగంగా, బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడానికి చర్యలు ప్రారంభించామన్నారు. బీసీలను కులాలు, వృత్తుల పేరుతో దూషించినా, వారిపై దాడులకు, దౌర్జన్యాలకు దిగినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా రక్షణ చట్టం రూపొందిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీలపై జరిగే దాదాపు 15 రకాల దాడులు, వేధింపులను ఈ చట్టం కింద నేరాలు గుర్తిస్తామన్నారు. బీసీ రక్షణ చట్టంలో భాగంగా కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. గత సాధారణ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన తరవాత బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, ఇప్పటికే చట్ట రూపకల్పనకు పలు పర్యాయాలు కేబినెట్ లో ఉన్న ఎనిమిది మంది బీసీ మంత్రులు పలు పర్యాయాలు భేటీ అయ్యామన్నారు. భారత రాజ్యాంగానికి లోబడి పలు చట్టాలను పరిశీలించి, అధికారులు బీసీ రక్షణ చట్టానికి తుది రూపు తీసుకొచ్చారన్నారు. ఈ ముసాయిదా చట్టానికి తుది రూపు ఇచ్చే క్రమంలో బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో కీలక భేటీ విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ లో బుధవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తనతో పాటు ఏడుగురు బీసీ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్ధసారథి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ సహా హోం మంత్రి అనిత, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కూడా హాజరుకానున్నారన్నారు. వారితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఆరుగురు ఎంపీలు ఈ సమావేశం పాల్గొననున్నట్లు తెలిపారు. వారిచ్చే సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇచ్చి, సీఎం చంద్రబాబునాయుడుకు అందజేయనున్నామన్నారు. బీసీల అభ్యున్నతికి, గౌరవ ప్రదమైన జీవనానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. దేశంలోనే బీసీలకు సంబంధించి ప్రత్యేక రక్షణ చట్టం తెస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుందని మంత్రి సవిత తెలిపారు.
Prajavartha Online Telugu News