-మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత
-2028 నాటికి నిర్మాణాలు పూర్తి
-అద్భుతంగా మంత్రులు, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల నివాసాలు
-జోరుగా రాజధాని రహదారుల నిర్మాణాలు
-ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్న సీఎం చంద్రబాబు
-అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ : మంత్రి అనగాని
-చదువు గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
-మంత్రి నారా లోకేశ్ తో జగన్ కు పోలికే లేదు
-జగన్ ది విధ్వంసం… మాది అభివృద్ధి : మంత్రి సవిత
-మావిగన్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని జగన్
-వైసీపీ అరాచకాలపై మంత్రి సవిత మండిపాటు
-అమరావతిలో పనులు పరిశీలించిన మంత్రులు అనగాని, నారాయణ, సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు జాతి గర్వించేలా రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని, 2028 ఆగస్టు నాటికి మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత తెలిపారు. అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ ఆనాడు అమరావతి గ్రాఫిక్స్ అని తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకుందన్నారు. గ్రాఫిక్స్ కు, వాస్తవాలకు జగన్ కు తేడా తెలియదా..? అని ప్రశ్నించారు. జగన్ విధ్వంసపు క్రెడిట్ ఎవ్వరికీ అక్కర్లేదని, తమ ప్రభుత్వానికి అభివృద్ధి అని స్పష్టం చేశారు. చదువు గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న మంత్రి నారా లోకేశ్ తో ఆయనకేంటి పోలికని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి పనులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, ఎస్.సవిత మంగళవారం పరిశీలించారు. తొలుత మంత్రుల నివాసాలను తరవాత సచివాలయం, హెచ్ ఓడీ ఐకానిక్ టవర్లను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల టవర్లను పరిశీలించారు. ఇప్పటికే పూర్తయిన మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై మంత్రులు ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ముందుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ అమరావతిలో గ్రాఫిక్స్ నిర్మాణాలంటూ తప్పుడు ప్రచారాలు చేసిందన్నారు. గ్రాఫిక్స్ కు, వాస్తవాలకు జగన్ కు తేడా తెలియదా..? అని ప్రశ్నించారు. చదువు గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న ఉన్నత విద్యా వంతుడితో మంత్రి నారా లోకేశ్ తో ఆయనకు పోలికే లేదన్నారు. మంత్రి నారా లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలని వైసీపీనుద్దేశించి మంత్రి అనగాని ప్రశ్నించారు. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినందుకా… రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నందుకా..? అని నిలదీశారు. మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు.
2028 నాటికి అమరావతి సిద్ధం : మంత్రి సవిత
తెలుగుజాతి గర్వించేలా అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు చేపట్టారని మంత్రి సవిత తెలిపారు. సచివాలయం, హెచ్ ఓడీ టవర్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలు అద్భుతం నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలు పూర్తయ్యాయని, ఈ నెల 15 తేదీన జీఏడీకి అప్పగించనున్నారని తెలిపారు. 2028 నాటికి సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ తదితర ఐకానిక్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నామన్నారు. రాజధాని పనుల్లో ముఖ్యమైన రోడ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ప్రజలకు అన్ని సేవలు ఒకేచోట లభించేలా సచివాలయం, హెచ్ ఓడీ కార్యాలయాలను నిర్మిస్తున్నామన్నారు. గతంలో హైటెక్ సిటీ సైబరాబాద్ ను నిర్మించిన సీఎం చంద్రబాబునాయుడు అమరావతిని కూడా పూర్తి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి సవిత కొనియాడారు.
జగన్ ది విధ్వంసం… మాది అభివృద్ధి…
ప్రపంచం మెచ్చేలా గ్రీన్ ఫీల్డ్ రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మిస్తుండడం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ ది విధ్వంసం క్రెడిట్ అని , తమ ప్రభుత్వానికి అభివృద్ధి క్రెడిట్ అని అన్నారు. రప్పా రప్పా నరకడం, విధ్వంసం, దోపిడీ, అరాచకం ఇవి జగన్ క్రెడిట్ అని అన్నారు. ఆ క్రెడిట్ ను ఎవ్వరూ ఆశించరన్నారు. ప్రజలు ఛీ కొట్టడంతో ఇప్పుడు మావిగన్ అంటూ మరో డ్రామా ఆడుతున్నారన్నారు. మావిగన్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని జగన్ అని విమర్శించారు. నిరసనల పేరుతో రాష్ట్రంలో జగన్, వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News