Breaking News

నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలి

-తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భద్రత
-లక్ష్యం దిశగా అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు
-రెండు ప్రాజెక్టుల కింద రూ.270 కోట్ల విలువైన పనులు పురోగతిలో
-కీలక నిర్మాణాలు వేగవంతం.. 400 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ నిర్మాణం పూర్తి
-నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తా
-ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో జల్ జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఆయా జిల్లాల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి దాహార్తి తీర్చే బలమైన సంకల్పాన్ని ఈ ప్రాజెక్టుల ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువులోపు ముఖ్యమైన నిర్మాణాలు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో చేపట్టిన జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై పవన్ కళ్యాణ్  సమీక్షించారు. ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లతోపాటు పైప్‌లైన్ల నిర్మాణం వంటి కీలక పనుల పురోగతికి సంబంధించిన వివరాలపై ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టిన పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుండడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
పనుల పురోగతి వివరాలు
ఈ సమీక్షలో పనుల వివరాలను అధికారులు తెలియజేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రూ.1,650 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాన్ని 10 నియోజకవర్గాల పరిధిలో సుమారు 20 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండు ఇంటేక్ వెల్స్, యాక్సెస్ బ్రిడ్జిల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 111 MLD, 75 MLD సామర్థ్యాలతో ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల్లో ఒకటి నిర్మాణ దశలో ఉన్నట్టు వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.151 కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చించగా, 182 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో రూ.1,400 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ద్వారా సుమారు 13.50 లక్షల మందికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి. దీనికి సంబంధించి ఇంటేక్ వెల్, యాక్సెస్ బ్రిడ్జి, 155 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. రెండు పథకాల కింద సుమారు 400 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తయినట్టు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో గత ఏడాది డిసెంబర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా పెరవలిలో రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో అమరజీవి జలధారకు శ్రీకారం చుట్టాం. రెండు మెగా వాటర్ గ్రిడ్ పథకాల నిర్మాణంలో కీలకమైన ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. పనులన్నీ నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయంతో పని చేయాలి.
ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో నిరంతర పర్యవేక్షణ
కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యి నత్తనడకన నడుస్తున్న పనులపై దృష్టి సారించాలి. ముఖ్యంగా పైపు లైన్ల నిర్మాణానికి సంబంధించి ఇతర శాఖల అనుమతులు పెండింగ్ లో ఉంటే ఆ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి. ఆర్ అండ్ బి, జాతీయ రహదారి అథారిటీ, పంచాయతీరాజ్ శాఖలు, అవసరం ఉన్న చోట అటవీశాఖలతో సమన్వయం చేసుకుంటూ, పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ల ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో పనుల వేగం పెంచాలి. అదే సమయంలో నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడవద్దు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతా. నిర్మాణ పనులకు సంబంధించి నాణ్యతాపరమైన తనిఖీలు స్వయంగా నిర్వహిస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే విధంగా చర్యలు చేపడతామ”న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *