Breaking News

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ

-విద్య.. వసతి.. వికాసం కార్యక్రమానికి శ్రీకారం
-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చొరవతో సంక్షేమ హాస్టళ్ల సమగ్ర ఆధునీకరణ

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు ఇంటికి దూరంగా ఉన్నా ఇంటి వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చొరవతో “విద్య వసతి వికాసం” అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆధునిక వసతి కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీంతో జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.

మంగళవారం ఉదయం తిక్కన ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా లాంఛనంగా ప్రారంభించారు.

జిల్లాలోని 155 సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న 19,069 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా రూ.34.80 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇందులో రూ.20.35 కోట్లు (58 శాతం) మౌలిక వసతుల మరమ్మతులకు, రూ.14.45 కోట్లు (42 శాతం) ఫర్నిచర్, పరికరాలు, ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు కేటాయించారు.

ప్రాజెక్టులో భాగంగా పాత భవనాల మరమ్మతులు, పైకప్పుల పునరుద్ధరణ, ఫ్లోరింగ్, పెయింటింగ్, తలుపులు, కిటికీలు, ప్రహరీ గోడలు, మరుగుదొడ్ల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, బోర్‌వెల్లు, సింటెక్స్ ట్యాంకులు, ఆర్‌వో ప్లాంట్లు, వర్షపు నీటి సంరక్షణ, విద్యుత్ వైరింగ్ ఆధునీకరణ, సీలింగ్ ఫ్యాన్లు, లైటింగ్, సోలార్ లైట్లు తదితర పనులు చేపట్టనున్నారు.

అదే విధంగా హాస్టళ్లలో విద్యార్థుల నిత్యావసరాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. సానిటరీ న్యాప్‌కిన్ ఇన్సినిరేటర్లు, సోలార్ గీజర్లు, వాషింగ్ మెషీన్లు, కంప్యూటర్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఇన్వర్టర్లు, స్టీల్, అల్యూమినియం వంట పాత్రలు, నిల్వ ర్యాకులు, గ్రైండర్లు, మిక్సీలు, గ్యాస్ స్టౌలు, కుక్కర్లు, కుర్చీలు, టేబుళ్లు, ఎయిర్‌టైట్ కంటైనర్లు, డస్ట్‌బిన్లు, అద్దాలు, మగ్గులు, లైబ్రరీ పుస్తకాలు, బెడ్‌షీట్లు, ట్రంక్ బాక్సులు, క్రీడా సామగ్రి వంటి ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

జిల్లాలోని సామాజిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ గురుకులాలు, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టళ్లన్నీ ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. విద్యార్థుల సంఖ్య, హాస్టళ్ల అవసరాలను పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపు చేపట్టారు.

ప్రాజెక్టును ఐదు దశల్లో అమలు చేయనున్నారు. ముందుగా పరిపాలనా అనుమతులు, నిధుల మంజూరు, సంస్థల వారీగా పనుల కేటాయింపు, అనంతరం భవనాల మరమ్మతులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్ పనులు, పరికరాల కొనుగోలు, పంపిణీ, చివరగా నాణ్యత తనిఖీలు నిర్వహించి పూర్తి స్థాయిలో అమలు చేస్తారు.

జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారత అధికారి నోడల్ అధికారిగా వ్యవహరించగా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ విభాగం నిర్మాణ పనుల అమలు, నాణ్యత పర్యవేక్షణ చేపడుతుంది. ప్రతి హాస్టల్‌లో భౌతిక, ఆర్థిక పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, అవసరమైతే థర్డ్ పార్టీ తనిఖీలు కూడా నిర్వహించనున్నారు.

“ప్రతి విద్యార్థికి సురక్షితమైన, గౌరవప్రదమైన, నాణ్యమైన వసతి కల్పించడమే విద్య వసతి వికాసం కార్యక్రమం లక్ష్యం. మౌలిక వసతుల కొరత వల్ల ఏ విద్యార్థి వెనుకబడకూడదన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం” అని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *