విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) ఫార్మేషన్ డే వేడుకల్లో, 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్లకు పైగా వ్యాపార పరిమాణం సాధించి అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (Krishna DCCB)కు ప్రతిష్ఠాత్మక “Recognition of Excellence” అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (RCS) & సహకార శాఖ కార్యదర్శి బాబు.ఏ, IAS, APCOB చైర్మన్ గన్నె వీరాంజనేయులు, APCOB మేనేజింగ్ డైరెక్టర్ వి. రామకృష్ణ మీదుగా కృష్ణా డీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం అందుకున్నారు.
ఈ సందర్భంగా నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ, ఈ అవార్డు కృష్ణా డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ల మండలి, సీఈఓ, అధికారులు, ఉద్యోగులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ప్రతినిధులు మరియు సభ్య రైతుల సమిష్టి కృషికి లభించిన గౌరవమని పేర్కొన్నారు. రైతులకు మరింత మెరుగైన, పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత బ్యాంకింగ్ సేవలు అందిస్తూ సహకార రంగంలో కృష్ణా డీసీసీ బ్యాంక్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల డిసిసిబి చైర్మన్లు కృష్ణా డీసీసీ బ్యాంక్ సీఈఓ శ్యామ్ మనోహర్, బ్యాంకు ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News