-క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
క్యూబాలో శుక్రవారం ప్రారంభం కానున్న 24వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శులు కె. రామకృష్ణ, రామకృష్ణ పాండాలను ఢిల్లీలో క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ అగ్యిలేరా (Juan Carlos Aguilera), క్యూబా రాయబార కార్యాలయ ప్రథమ కార్యదర్శి లూపే ఫ్రొమెటా (Lupe Frometa) గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా భారత్–క్యూబా మధ్య చిరకాలంగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలు, పరస్పర సహకారం, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ శాంతి, సంఘీభావ ఉద్యమాలు తదితర అంశాలపై వారు చర్చించారు. క్యూబా ప్రజలతో భారత ప్రజలకు, ముఖ్యంగా భారత కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్న చారిత్రక స్నేహబంధాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శులు గుర్తు చేసుకున్నారు. భారత్–క్యూబా ప్రజల మధ్య మైత్రి, సంఘీభావం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
క్యూబా విప్లవ చారిత్రక నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో విప్లవ వారసత్వాన్ని పరిరక్షించడం, సోషలిస్టు క్యూబాకు అంతర్జాతీయ సంఘీభావాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రపంచ శాంతి కోసం ఉమ్మడి కార్యాచరణను విస్తరించడం, సామ్రాజ్యవాద దాడులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల ఐక్యతను పటిష్టం చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఆగస్టు 7–8 తేదీల్లో హవానాలో 24వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల సమావేశం జరుగుతుందని క్యూబా నుంచి విడుదల చేసిన ప్రకటనలో కె. రామకృష్ణ తెలిపారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాల సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని పరిరక్షించేందుకు కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల మధ్య ఐక్యత, సంఘీభావం, పరస్పర సహకారం మరింత అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అసమానతలు, దోపిడీ, యుద్ధ ప్రమాదాలు, తీవ్ర మితవాదం, ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలను బలోపేతం చేసేందుకు హవానా సమావేశం దోహదపడుతుందని అన్నారు.
క్యూబా విప్లవ చారిత్రక నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో ఆలోచనలు నేటికీ అత్యంత ప్రాసంగికమైనవని కె. రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఆయన సామ్రాజ్యవాద వ్యతిరేక, మానవతావాద, అంతర్జాతీయవాద దృక్పథం ప్రపంచ శాంతి, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలకు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్యూబా కమ్యూనిస్టు పార్టీకి, క్యూబా ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు.
క్యూబాపై అమెరికా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక, వాణిజ్య, ఆర్థిక వ్యవహారాలు, ఇంధన రంగానికి సంబంధించిన ఆంక్షలపై కూడా ఈ అంతర్జాతీయ సమావేశంలో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని కె. రామకృష్ణ తెలిపారు. క్యూబాపై ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల సమావేశానికి ముందు క్యూబా రాయబారి, రాయబార కార్యాలయ ప్రతినిధులతో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె. రామకృష్ణ, రామకృష్ణ పాండా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్–క్యూబా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేస్తూ, ఇరు దేశాల ప్రజల మధ్య సంఘీభావాన్ని విస్తరించాలని వారు ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News