అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరో రెండు కొత్త ఎయిమ్స్ (ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మంజూరు చేయాలని, అలాగే ప్రస్తుతం సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి అత్యుత్తమ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డాకు గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐదు కోట్ల జనాభాకు ఒకే ఒక ఎయిమ్స్ సరిపోవడం లేదని ఎంపీ లింగమనేని రమేష్ వివరించారు. భౌగోళిక విస్తృతిని, ప్రాంతీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎయిమ్స్ మంజూరు చేయాలని ఆయన కోరారు.
గుండె జబ్బులు, క్యాన్సర్, న్యూరో, అవయవ మార్పిడి, అత్యవసర ట్రామా కేర్ వంటి వైద్య సేవల కోసం ఈ ప్రాంత ప్రజలు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని, ఈ ఇబ్బందులను తొలగించాలంటే ఆయా ప్రాంతాల్లో కొత్త ఆస్పత్రుల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. గతంలో జమ్మూ కశ్మీర్, బిహార్ వంటి చోట్ల ఒకటికి మించి ఎయిమ్స్ సంస్థలను కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఏపీకి కూడా అదే ప్రాతిపదికన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ప్రస్తుతం ఉన్న మంగళగిరి ఎయిమ్స్‌ను మరింత విస్తరించి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్, అడ్వాన్స్‌డ్ కార్డియాక్ కేర్ సెంటర్‌లతోపాటు మరిన్ని పడకలు, బోధనా సిబ్బందిని కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో ఉచిత, నాణ్యమైన వైద్య సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రధాన్ మంత్రి స్వస్థ్య సురక్ష యోజన తదుపరి విడతలో ఈ ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రి నడ్డాను లింగమనేని రమేశ్ కోరారు.
Tags amaravathi
Check Also
తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి
-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో …
Prajavartha Online Telugu News