* రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత
* నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం
* ఏటా రూ.25 వేలు అందజేసే పథకానికి నేడు శ్రీకారం
* చేనేతలకు చంద్రన్న పాలన ఎప్పుడూ స్వర్ణయుగమే : మంత్రి సవిత
* చీరాలలో నేడు 12 జాతీయ చేనేత దినోత్సవం
* ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు అనగాని, సవిత
చీరాల/బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
నేతన్నల బాగుకోరే ప్రభుత్వం తమదని, ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా చేనేతలకు ఆర్థిక మేలు కలుగజేయాలన్న ఉద్దేశంతో నేతన్న సేవలో పథకానికి సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుడుతున్నారని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏటా రూ.25 వేల ఆర్థిక సహాయమందిస్తూ, చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపనున్నారన్నారు. సీఎం చంద్రబాబు పాలన చేనేతలకు ఎప్పుడూ స్వర్ణయుగమేనన్నారు. జగన్ పాలనలో నేతన్నలు కష్టాల పాలయ్యారని, 2014-19 మధ్య చేనేత రంగ అభివృద్ధి కోసం అమలు చేసిన పథకాలను నిలిపేశారని మండిపడ్డారు. చీరాలలో 12 జాతీయ చేనేత దినోత్సవ వేడుకల ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్యతో కలిసి మంత్రి సవిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసి విలేకరులతో మాట్లాడారు. చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఒకవైపు చేనేత రంగ అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతూనే, నేతన్నలకు వ్యక్తిగత ఆర్థిక లబ్ధి కలిగేలా సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారన్నారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా మగ్గం నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు అందజేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం
నేతన్నలకు మరింత మేలు చేసేలా సీఎం చంద్రబాబునాయుడు నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుడుతున్నారన్నారు. ఈ పథకం ఏటా రూ.25 వేలను అర్హులైన చేనేతలకు అందజేయనున్నామన్నారు. ఎన్నికల్లోనూ, కూటమి మేనిఫెస్టోలోనూ హామీ ఇవ్వకపోయినా, చేనేతలు గౌరవప్రదమైన జీవనం సాగించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని శుక్రవారం జరిగే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ సీఎం చంద్రబాబునాయుడు చేనేత రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. 2014-19 మధ్యలో నేతన్నల అభ్యున్నతికి ఎన్నో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. చంద్రబాబు పాలన ఎప్పుడూ చేనేతలకు స్వర్ణయుగమేనన్నారు. తరవాత వచ్చిన జగన్ అన్ని రంగాల మాదిరిగా చేనేతను భ్రష్టుపట్టించారని మంత్రి సవిత మండిపడ్డారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేయండి…
అంతకుముందు మంత్రి సవిత చీరాలలో జరిగే 12 చేనేత జాతీయ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్యతో కలిసి వేదికను, ప్రాంగణాన్ని సందర్శించారు. చేనేతలు, స్థానికులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలొచ్చే అవకాశముందని, పార్కింగ్ కు, ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, చేనేత, జౌళి శాఖాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News