Breaking News

పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా భుజించాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా భుజించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. సమతుల ఆహారం విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని, విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కూడా ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించి రుచి చూశారు.

నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం ఆకస్మికంగా సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నారా అనే అంశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన తయారీ విధానం, వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, వంట ప్రక్రియ, నిల్వల పరిస్థితి తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. కిచెన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఆహార నిల్వల రిజిస్టర్లు, స్టాక్ నిర్వహణ, విద్యార్థుల హాజరు నమోదులను కూడా తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధతో పోషక విలువలు కలిగిన సమతుల ఆహార మెనూను రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలలోనే భుజించాలని సూచించారు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసం కూడా మెరుగుపడి చదువులో మంచి ప్రతిభ కనబరచడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ముఖ్యంగా బాలికలు మధ్యాహ్న భోజనాన్ని నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా పాఠశాలలోనే భుజించాలని కలెక్టర్ సూచించారు. పెరుగుతున్న వయస్సులో సరైన పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఆధునిక వసతులను కల్పిస్తోందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అర్హత కలిగిన, నైపుణ్యం గల ఉపాధ్యాయులను నియమించి బోధన అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతోందన్నారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో ఎ.అనిల్ కుమార్, తహసీల్దార్ నూతక్కి సురేష్ బాబు, ఎంపీడీవో వరప్రసాద్, ఎంఈఓ పద్మ, రెవెన్యూ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి

-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *