విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనసభ, పార్లమెంట్ పరిధిలో బ్రాహ్మణుల ఓటింగ్ బలాన్ని బట్టి 2 లోక్ సభ స్థానాలు విశాఖపట్నం, గోదావరి జిల్లాలు,.6 శాసనసభ స్థానాలు విజయవాడ, బాపట్ల, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో బ్రాహ్మణ అభ్యర్థులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని శ్రీ వేద విజ్ఞాన పరిషత్ ఛైర్మెన్, రచయిత, సామాజికవేత్త డి.వి.బాల సుబ్రహ్మణ్యం ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కుటుంబ నేపథ్యం వ్యక్తిగత పలుకుబడి, ఆర్థిక సంబంధమైన శక్తి సామర్థ్యం, అభ్యర్థి సామాజిక వర్గంతో పాటు,కలిసివచ్చే ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకుని స్టీరింగ్, అడ్వైజరీ బోర్డ్ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేస్తుందని తెలిపారు. గెలవగలిగి అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం డాక్టర్ అర్చన, పి కె రావు, రామకోటయ్య, డాక్టర్ రామకృష్ణ, డొక్కా జగన్నాథం, రమణమూర్తిలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు చట్టపరమైన సలహాల కోసం కే.ఎస్. శర్మ, కామేశ్వరితో న్యాయ నిపుణుల కమిటీ నియామకం జరిగినట్లు బాల సుబ్రహ్మణ్యం వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో బ్రాహ్మణ భవన్ నిర్మాణం కోసం 2.5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణ ఉద్యోగులపై జరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టేందుకు 24 గంటల్లో చర్యలు తీసుకునేలా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలనీ ఆయన డిమాండ్ చేసారు. వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ‘అమ్మఒడి’ పథకం వర్తింపజేయాలనీ,. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే పేద, మధ్యతరగతి బ్రాహ్మణ విద్యార్థులకు వడ్డీ లేని ఆర్థిక సాయం అందించాలనీ ఆయన కోరారు. శ్రీ వేద విజ్ఞాన పరిషత్ – బ్రాహ్మణ మేధావుల తదుపరి ఆత్మీయ సమావేశం ఆగస్టు 30న విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వేద విజ్ఞానం, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, బ్రాహ్మణుల సంక్షేమం, వేద పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు.
Prajavartha Online Telugu News