నాణ్యమైన విద్య, సమర్థ నాయకత్వంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

-SNA-SPARSH శిక్షణలో సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఐ.ఏ.ఎస్.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు సమాన అవకాశాలు అందేలా పనిచేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఐ.ఏ.ఎస్., అన్నారు. తిరుపతి రాహుల్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన SNA-SPARSH శిక్షణ కార్యక్రమంలో జోన్–3 పరిధిలోని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (DDOs)ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకాన్ని తల్లిదండ్రులు, ప్రజల్లో పెంచాల్సిన బాధ్యత విద్యాశాఖలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

నాణ్యమైన విద్యకు ఉపాధ్యాయులే ముఖ్యం

ఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణానికి పునాది అని ఎస్పీడీ అన్నారు. ఉపాధ్యాయులు వారిలో ఉన్న ప్రతిభ, సామర్థ్యం, అనుభవాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించి విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని చెప్పారు. బోధనా పద్ధతులు, అనుభవంతో నేర్చుకునే విధానం, బోధన చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అర్థమయ్యే విధంగా బోధన అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.

ప్రధానోపాధ్యాయులు సమర్థవంతమైన నాయకులుగా వ్యవహరించాలి

ప్రధానోపాధ్యాయులు పరిపాలనా బాధ్యతలు నిర్వహించడంతో పాటు సమర్థవంతమైన నాయకులు, మార్గదర్శకులుగా వ్యవహరించాలని ఎస్పీడీ సూచించారు. అవసరమైన సందర్భాల్లో ప్రధానోపాధ్యాయులు స్వయంగా తరగతి గదిలో బోధిస్తూ ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేయాలన్నారు. తమ పాఠశాలలో బోధన నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మెరుగుపరచాలని సూచించారు.

అందరికీ నాణ్యమైన విద్య అందాలి

ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని ఎస్పీడీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి మంచి విద్య అందుతుందనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కల్పించాలని సూచించారు. నాణ్యమైన విద్య అందరికీ సమానంగా అందాలని, ఇదే అందరి లక్ష్యం కావాలని అన్నారు. ఉపాధ్యాయుల్లో ఉన్న ప్రతిభ, సామర్థ్యం, అనుభవాన్ని పూర్తిస్థాయిలో విద్యార్థుల అభ్యున్నతికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు.

ప్రాథమిక అభ్యాసం, పఠనంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

విద్యార్థుల్లో చదవడం, రాయడం, లెక్కలు వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంచేందుకు Teaching at the Right Level (TaRL) విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని ఎస్పీడీ సూచించారు. HPC కార్డులను కూడా సక్రమంగా వినియోగించాలని అన్నారు. ప్రతి విద్యార్థికి గ్రంథాలయ పుస్తకాలు అందుబాటులో ఉంచి, వారిలో చదివే అలవాటును పెంపొందించాలని చెప్పారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు, ఆలోచనా శక్తి, అవగాహన పెరుగుతాయని తెలిపారు.

STEM ల్యాబ్‌లను విద్యార్థుల అభ్యాసానికి ఉపయోగించాలి

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న Science Labs, STEM Labs, Atal Tinkering Labs (ATLs), PAL Labs వంటి సౌకర్యాలను కేవలం మౌలిక వసతులుగా కాకుండా విద్యార్థుల అభ్యాసానికి చురుకుగా ఉపయోగించాలని ఎస్పీడీ సూచించారు. విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవం కల్పించి, వారు స్వయంగా పరిశీలించేలా, ప్రయోగాలు చేసేలా, ప్రశ్నలు అడిగేలా, సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా అవకాశాలు కల్పించాలని అన్నారు.

మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం, పోషకాహారం అందించడం కూడా ప్రభుత్వ ప్రాధాన్యత అని ఎస్పీడీ తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కోసం ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పర్యవేక్షించాలని అన్నారు.

పాఠశాలల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలి

ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను తరచుగా సందర్శించి అక్కడి బోధనా విధానం, TLMల వినియోగం, విద్యార్థుల అభ్యాస పురోగతిని పరిశీలించాలని ఎస్పీడీ అన్నారు. ప్రభుత్వం SRKVM ద్వారా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, షూస్ తదితర విద్యా సామగ్రి ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

తల్లిదండ్రులతో పాఠశాలల అనుబంధం పెంచాలి

Mega Parent-Teacher Meetings ద్వారా తల్లిదండ్రులతో పాఠశాలల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని ఎస్పీడీ అన్నారు. బడిమానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలను SRKVM డ్యాష్‌బోర్డుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట చర్యలు చేపట్టాలని తెలిపారు.

బాధ్యతతో పనిచేస్తేనే మంచి ఫలితాలు

విద్యాశాఖలోని ప్రతి ఒక్కరూ తమ విధులను సొంత బాధ్యతగా భావించి అంకితభావంతో పనిచేయాలని ఎస్పీడీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న ప్రతి వనరును సమర్థంగా వినియోగించుకుని విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు.

“ఉపాధ్యాయ జీవితానికి ఘనమైన పదవీ విరమణ అనేది కేవలం ఉద్యోగ విరమణ కాదు. మనం తీర్చిదిద్దిన విద్యార్థుల విజయాలను చూసి సంతృప్తి, అనుభవంతో గర్వపడే స్థాయికి చేరుకోవాలి” అని ఎస్పీడీ ఆకాంక్షించారు.
ఈ ప్రాంతీయ శిక్షణలో స్టేట్ ఫైనాన్స్ కంట్రోలర్ రాజగోపాల రావు, కడప ఆర్జేడీ కే. శామ్యూల్
తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్, పీఎంశ్రీ ప్రతినిధి డా. ఎస్. ప్రసాదరావు, సీమ్యాట్ లెక్చరర్ సురేష్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు, సెక్టోరల్ అధికారులు, ఏఎంవోలు (డా. చంద్రశేఖర్ నాయుడు, వి. మనోహర్), ఏపీఓ (డా. ఏ. సుధాకర్), సీఎంవో (రెడ్డి వెంకటరమణ), ఉప విద్యాశాఖాధికారులు , మండల విద్యాశాఖాధికారులు, ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల DDO ప్రధానోపాధ్యాయులు, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ (KGBV) ప్రిన్సిపాళ్లు, KGBV Type-IV హాస్టల్ వార్డెన్లు, సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *