-పాఠశాలలో ఫైర్ మాక్ డ్రిల్, భద్రతా ప్రమాణాల తనిఖీ
-అత్యవసర సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు దిశానిర్దేశం
-హాజరైన ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ ఆశా జార్జ్, సిబ్బంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ మార్గాలపై సంపూర్ణ అవగాహన ఉండాలని ప్రాంతీయ అగ్నిమాపక అధికారి (ఆర్‌ఎఫ్‌ఓ) రత్నబాబు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ సింగ్‌నగర్‌లోని ప్రముఖ సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం, ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎఫ్ఓ రత్నబాబు మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు కంగారు పడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని చెప్పారు. ప్రమాదం జరగగానే మొదట ఫైర్ బ్రిగేడ్‌కు 101 సమాచారం ఇవ్వాలని, అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్‌లో అగ్నిమాపక పరికరాల వినియోగంపై విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు. సిలిండర్లలో గ్యాస్ లీకై మంటలు వ్యాపిస్తే వాటిని ఆర్పే పద్ధతులు, సిలిండర్ ఫైర్ ఎక్స్‌టింగ్వైషర్‌ను పనిచేయించే తీరును అధికారులు క్షుణ్ణంగా వివరించారు. అలాగే పాఠశాల భవనంలోని ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, అత్యవసర నిష్క్రమణ (ఎమర్జెన్సీ ఎగ్జిట్) మార్గాలను, భద్రతా ప్రమాణాలను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. భవనాల్లో తగినన్ని అగ్నిమాపక పరికరాలు నిరంతరం సిద్ధంగా ఉంచుకోవాలని యాజమాన్యానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ ఆశా జార్జ్, పీఈటీ జోసెఫ్, పాఠశాల ఉపాధ్యాయులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.
Prajavartha Online Telugu News