– క్షణాన్ని బంధించి.. శాశ్వత జ్ఞాపకంగా నిలిపే కళ ఫొటోగ్రఫీ
– సంఘటనలకు సజీవ సాక్ష్యాలుగా ఛాయాచిత్రాలు
– సమాజంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకం
– ప్రతిఒక్కరికీ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు
– ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు నగదు బహుమతులు, సత్కారం
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక ఛాయాచిత్రం.. వెయ్యి మాటల భావానికి ప్రతిరూపమని, ఒక క్షణాన్ని శాశ్వతంగా బంధించి ఆ క్షణంలోని భావోద్వేగాన్ని, సంఘటనను, చరిత్రను భావితరాలకు అందించే అద్భుతమైన కళ ఫొటోగ్రఫీ అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తొలుత జిల్లా కలెక్టర్ లక్ష్మీశ.. విజయవాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, సమాచార, పౌర సంబంధాల శాఖ జోన్ – 2 ఆర్‌జేడీ పి.తిమ్మప్ప, జిల్లాస్థాయి ఫొటోగ్రఫీ పోటీల జ్యూరీ సభ్యులు టీఎస్ రెడ్డి (ఎఫ్ఆర్‌పీఎస్), సీహెచ్ విజయభాస్కరరావు (ఏఆర్‌పీఎస్), కె.రవికుమార్ తదితరులతో కలిసి ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని.. ఫొటోగ్రఫీ అనేది క్షణాలను చిత్రాలుగా మలిచి, జ్ఞాపకాలను పదిలపరిచి, మాటలకు అందని కథలను ప్రపంచానికి చెప్పగల శక్తివంతమైన మాధ్యమం అని పేర్కొన్నారు. ఒక మంచి ఛాయాచిత్రం ఒక సంఘటనను సరైన విధంగా నిక్షిప్తం చేసి.. సమాజంలోని భావోద్వేగాలను, సంస్కృతిని, అభివృద్ధిని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలను ప్రజలకు చేరవేయడంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఫొటో జర్నలిస్టుల్లోని ప్రతిభను ప్రోత్సహించి, గుర్తించి, సత్కరించేందుకు ఏటా జిల్లాస్థాయిలో ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నామని.. భవిష్యత్తులో వీడియో జర్నలిస్టులు, అమెచ్యూర్ ఫొటోగ్రాఫర్లను కూడా వీటిలో భాగస్వామ్యం చేస్తామన్నారు. ఈ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
*ఆర్‌డీవో వెన్నెల శ్రీను మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సంస్కృతి, కళలు, వారసత్వానికి కూడా ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఫొటోగ్రాఫర్ల ప్రతిభిను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఐ అండ్ పీఆర్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ పి.తిమ్మప్ప మాట్లాడుతూ జర్నలిస్టులు అక్షర సైనికులు అయితే ఫొటోగ్రాఫర్లు దృశ్య సైనికులు అని.. ఒక ఘటనను శాశ్వత జ్ఞాపకంగా పొందుపరిచే అద్భుత కళ ఫొటోగ్రఫీ అని పేర్కొన్నారు. ఫొటో జర్నలిస్టులు సమ దృష్టితో తీసే ఫొటోలు సామాజిక బాధ్యతకు ప్రతిరూపాలుగా నిలుస్తాయని, ఓ గొప్ప మార్పునకు, అభివృద్ధికి దోహదపడతాయని తిమ్మప్ప అన్నారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ టీఎస్ రెడ్డి, సీనియర్ ఫొటోగ్రాఫర్ విజయభాస్కరరావు తదితరులు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఫొటోగ్రాఫర్ల తరఫున కలెక్టర్ లక్ష్మీశకు ధన్యవాదాలు తెలియజేశారు.
27 మంది విజేతలకు నగదు బహుమతులు:
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, యువత, పీ4, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, ఉత్తమ న్యూస్ పిక్చర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించగా… మొత్తం 221 ఛాయాచిత్రాల ఎంట్రీలుగా రాగా.. 27 ఉత్తమ ఛాయాచిత్రాలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. వీరికి కలెక్టర్ లక్ష్మీశ అతిథులతో కలిసి నగదు బహుమతులు, ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. కేటగిరీ 1 ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, వారసత్వం, పర్యాటకంలో ప్రథమ బహుమతి వైవీవీ సత్యనారాయణ, ద్వితీయ బహుమతి ఎన్.కిశోర్, తృతీయ బహుమతి ఎం.ప్రశాంత్ సాధించగా యు.దుర్గారావు, పి.ప్రసాద్, వైవీ ఆనంద్, ఆర్‌వీ అప్పారావు, కె.తిరుపతయ్య, కేబీ నవీన్‌లు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. కేటగిరీ 2 యువత, పీ4, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమంలో ప్రథమ బహుమతి జీఎన్ రావు, ద్వితీయ బహుమతి సీహెచ్ నారాయణరావు, తృతీయ బహుమతి ఎస్ఎస్ విజయబాబులు సాధించగా సీహెచ్ మస్తాన్, మణికంఠ, సీహెచ్ నారాయణరావు, బి.సతీష్ కుమార్, రాజేష్, బి.మరిడయ్యలు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. అదేవిధంగా కేటగిరీ 3 ఉత్తమ న్యూస్‌పిక్చర్‌లో కేవీఎస్ గిరి, ద్వితీయ బహుమతి ఎ.రాజేంద్రప్రసాద్, తృతీయ బహుమతి దుర్గాప్రసాద్ సాధించగా ఎ.రామచంద్రరావు, కె.చక్రపాణి, జి.మహేష్, బి.మరిడయ్య, ఎం.సంపత్ కుమార్, ఎస్.లక్ష్మీపవన్ ప్రోత్సాహక బహుమతులను అందుకున్నారు.
ఫొటోగ్రఫీ పోటీల్లో బహుమతులు పొందిన ఛాయాచిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనతో పాటు, సీనియర్ ఫొటోగ్రాఫర్ పొట్లూరి ప్రసాద్ దశాబ్దాలుగా విశేష కృషితో సేకరించిన అరుదైన, వివిధ రకాల కెమెరాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యక్రమంలో డీఐపీఆర్‌వో కేవీ రమణరావు, డీపీఆర్‌వో ఎన్.నాగేశ్వరరావు, డివిజనల్ పీఆర్‌వో కె.రవి, ఫొటోగ్రఫీ పోటీల సమన్వయకర్త వీవీ ప్రసాద్, వీఎంసీ పీఆర్‌వో డా. రజియా షబీనా, సహాయ సమాచార ఇంజనీర్ కె.ధనుంజయరాజు, ఏవీఎస్ బి.బాలాజీ, ఫొటో జర్నలిస్టులు, స్టూడియో ఫొటోగ్రాఫర్లు, ఔత్సాహక ఫొటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News