– ప్రశాంత మనసుతోనే మెరుగైన పనితీరు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
– విజయవంతంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వివిధ సేవలు అందించే ఉద్యోగులు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని.. ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించి, సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గురువారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ఆకర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్ణ వార్డు కార్యాలయాలతో పాటు పీజీఆర్ఎస్ విభాగానికి చెందిన 50 మంది ఉద్యోగులకు ఒత్తిడి నిర్వహణపై అవగాహన కార్యక్రమం జరిగింది. సైకాలజిస్టు నండూరి వెంకట సుబ్బారావు రోజువారీ వృత్తి జీవితంలో ఒత్తిడి నిర్వహణకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పని ఒత్తిడిని గుర్తించడం, దాన్ని నియంత్రించుకోవడం, సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడం, సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం వంటి అంశాలు చాలా ముఖ్యమైనవన్నారు. ఉద్యోగులు తమ రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని ఆహ్లాదకరమైన కార్యక్రమాలకు యోగా, ధ్యానం వంటి వాటికి కేటాయించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, అదేవిధంగా పని ప్రదేశంలో పరస్పర సహకారం, స్నేహపూర్వక వాతావరణం, సానుకూల దృక్పథం ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృఢపరిచేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిలో ఆకర్ష ఫౌండేషన్ కృషి, భాగస్వామ్యం అభినందనీయమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో సైకాలజిస్టు డా. టీఎస్ రావు, కార్యక్రమం నోడల్ అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News