Breaking News

ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు

-90 కేసులపై విచారణ — ఐదు ఆసుపత్రులపై ఆరోపణలు నిర్ధారణ
-ఐదు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు అపరాధ రుసుము విధింపు
-పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాలి
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద పేదలకు అందుతున్న ఉచిత వైద్య సేవల్లో అవకతవకలు, నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లకు పాల్పడే నెట్‌వర్క్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ హెచ్చరించారు.

జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ వైద్య సేవల సమీక్షా సమావేశంలో పథకానికి సంబంధించి అందిన 90 ఆరోపణ కేసులను సంబంధిత ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధుల సమక్షంలో విచారించారు. విచారణలో ఐదు ఆసుపత్రులకు సంబంధించిన ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతో, వాటి యాజమాన్యాలకు అపరాధ రుసుము విధించారు. అపరాధ రుసుము విధించిన ఆసుపత్రుల్లో ఇబ్రహీంపట్నం నిమ్రా హాస్పిటల్, తిరువూరు శ్రీ భవాని హాస్పిటల్, తిరువూరు శ్రీ వైష్ణవి హాస్పిటల్, విజయవాడ ఎం.వి.ఎస్. యాక్సిడెంట్ హాస్పిటల్, విజయవాడ స్మైల్ హాస్పిటల్ ఉన్నాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ, పేదల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అనేక వ్యాధులకు ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. పథకం పరిధిలో ఉచితంగా అందించాల్సిన సేవలకు రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, అదనపు ఖర్చులకు గురిచేయడం, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించడం హేయమైన చర్యలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవల పథకం లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే నెట్‌వర్క్ ఆసుపత్రులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని, ఆరోపణలు, ఫిర్యాదులపై నిరంతరం విచారణ జరిపి తప్పులు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు పేద రోగుల పట్ల మానవతా దృక్పథంతో, గౌరవప్రదంగా, నాణ్యమైన మరియు పారదర్శకమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పేద కుటుంబాలు అనారోగ్యం కారణంగా ఆర్థికంగా చితికిపోకుండా అండగా నిలవడమే ఎన్టీఆర్ వైద్య సేవల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా కోఆర్డినేటర్ డా. జె. సుమన్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘునందన్, డీఎం అండ్ హెచ్‌ఓ డా. శ్రవణ్ బాబు, డీసీహెచ్‌ఎస్ ఓ. మాధవి దేవి, ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, చికిత్స పొందిన రోగుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *