– నిర్వహణకు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలి
– సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ ఆర్.రమేష్‌బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లాకు 57 సీజనల్ హాస్టళ్లు మంజూరయ్యాయని.. వీటి నిర్వహణకు గిరిజన, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు స్వయం సహాయక సంఘాలు, రిజిస్టర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ) ఆర్.రమేష్‌బాబు గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎ.కొండూరు, చందర్లపాడు, గంపలగూడెం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ రూరల్ మండలాల్లోని వలస వెళ్లిన తల్లిదండ్రుల పిల్లల కోసం చదువు, భోజన వసతి కల్పించేందుకు ఈ హాస్టళ్లు మంజూరయ్యాయన్నారు. దరఖాస్తు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా గుర్తింపు పొంది, మూడేళ్ల అనుభవం ఉండాలన్నారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన వారు డీఆర్‌డీఏ పీడీ అనుమతితో దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా అనుబంధ శాఖల వారు రాతపూర్వక దరఖాస్తులను ఈ-మెయిల్ లేదా లేఖద్వారా పంపాలని సూచించారు. ప్రతిపాదనలను ఈ నెల 24వ తేదీలోగా విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయంలో అందజేయాలని కోరారు. పూర్తి వివరాలకు ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ (8712655816)ను సంప్రదించవచ్చని ఏపీసీ రమేష్‌బాబు సూచించారు.
Prajavartha Online Telugu News