-నగదు రహిత వైద్య సేవలను తిరస్కరించకూడదు
-పథకంపై ఆసుపత్రులు, ప్రజలకు పూర్తి అవగాహన అవసరం
-జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు పీఎం రాహత్ పథకం కింద నగదు రహిత అత్యవసర వైద్య సేవలు అందించడం నెట్‌వర్క్ ఆసుపత్రుల బాధ్యతని, చికిత్స అందించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం జిల్లాలోని 51 నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులకు నిర్వహించిన పీఎం రాహత్ పథకం అవగాహన, శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 13న పీఎం రాహత్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం కింద ప్రతి ప్రమాద బాధితుడికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స, ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా ఏడు రోజుల వరకు అందే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడికి అత్యవసర వైద్య సేవలు అందించడమే పథకం ప్రధాన ఉద్దేశమని, డబ్బు లేకపోవడం వల్ల చికిత్స ఆలస్యం కావడం లేదా ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి రాకూడదని కలెక్టర్ పేర్కొన్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రులు పథకం నిబంధనల ప్రకారం ప్రమాద బాధితులకు పూర్తి బాధ్యతతో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పథకం పరిధిలోకి వచ్చే చికిత్సకు సంబంధించి బాధితుల నుంచి నగదు కోరడం లేదా సేవలను నిరాకరించడం చేయకూడదని స్పష్టం చేశారు. పథకం అమలుపై ఆసుపత్రుల ప్రతినిధులతో పాటు ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రమాద బాధితులను వీలైనంత త్వరగా సమీపంలోని అర్హత కలిగిన నెట్‌వర్క్ ఆసుపత్రికి తరలించి, తక్షణ వైద్య సహాయం అందేలా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడటమే పీఎం రాహత్ పథకం ప్రధాన లక్ష్యమని, నెట్‌వర్క్ ఆసుపత్రులు దీనిని మానవతా దృక్పథంతో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డా.శ్రవణ్ బాబు, డీసీహెచ్‌ఎస్ డా.ఓ.మాధవి దేవి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రఘునందన్, ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా కోఆర్డినేటర్ డా. జె.సుమన్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, 51 నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News