విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని నగరపాలక సంస్థ బయాలజీ సూర్యకుమార్ నాయక్ అన్నారు . కమిషనర్ ఆదేశాల మేరకు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్‌చార్జి గోపాల నాయక్ సూచనలతో బయాలజిస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతినగర్‌లో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించారు. నీటి నిల్వల్లో దోమల లార్వా కనిపించిన ప్రాంతాల్లో వెంటనే లార్వా నివారణ చర్యలు చేపట్టారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా ఇంటి లోపల, బయట ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రతి శుక్రవారం డ్రైడేలో భాగంగా ఇళ్ల పరిసరాల్లోని చిన్నచిన్న వస్తువుల్లో కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సిబ్బంది సూచించారు. ముఖ్యంగా పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, పాత బకెట్లు, కూలర్లు, వాటర్ బాటిళ్లు, టైర్లు తదితర వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా ఖాళీ చేయాలని తెలిపారు.
నగరంలో దోమల సమస్యను నివారించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు, కాలువల్లో పూడికతీత వంటి చర్యలు నిరంతరం చేపడుతున్నప్పటికీ, ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని అధికారులు తెలిపారు. ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ నీటి నిల్వలను తొలగించినప్పుడే దోమల ఉత్పత్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని, తద్వారా దోమల ద్వారా వ్యాపించే అనారోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో మలేరియా ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News