Breaking News

రోడ్డు భద్రతలో ఆదర్శ పట్టణంగా విజయవాడను నిలబెడదాం

-ఐడియల్ టౌన్ ఆన్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్టుతో లక్ష్యాలను చేరుకుందాం
-ప్రమాద మరణాలు, క్షతగాత్రులను 10–15 శాతం తగ్గించడమే లక్ష్యంగా చర్యలు
-నాలుగు కీలక అంశాలతో సమగ్ర రోడ్డు భద్రత కార్యాచరణ
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు భద్రతలో విజయవాడను ఆదర్శ పట్టణంగా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని.. అదేవిధంగా లక్ష్యాల సాధనకు ఐడియల్ టౌన్ ఆన్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
విజయవాడను రోడ్డు భద్రతలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐడియల్ టౌన్ ఆన్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆవిష్కరించారు.
హోండా ఇండియా ఫౌండేషన్ సీఎస్‌ఆర్ భాగస్వామిగా, ట్రాక్స్ – రోడ్ సేఫ్టీ ఎన్‌జీవో అమలు సంస్థగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. రవాణా, పోలీస్ శాఖల సహకారంతో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు, క్షతగాత్రులను 10–15 శాతం మేర తగ్గించడం, ప్రజల్లో రోడ్డు భద్రతపై బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టును ప్రధానంగా ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ కేర్ అనే నాలుగు అంశాల ఆధారంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా బ్లాక్‌స్పాట్‌లలో మౌలిక వసతుల లోపాలను గుర్తించి సరిచేయడం, జీరో టాలరెన్స్ జోన్ల ద్వారా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, 105 పాఠశాలలు, 14 కళాశాలల్లో సుమారు 70 వేల మంది విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, హెల్మెట్, సీటుబెల్ట్, లేన్ క్రమశిక్షణ, పాదచారుల భద్రతపై ప్రచారం నిర్వహించడం, అలాగే ప్రమాదాల సమయంలో సకాలంలో ప్రాథమిక సహాయం అందించేందుకు ఫస్ట్ రెస్పాండర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వ శాఖలు, పోలీస్, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర భాగస్వామ్య సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమన్వయంతో పనిచేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో హోండా ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు విజయవాడ–ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్, ట్రాక్స్ – రోడ్ సేఫ్టీ ఎన్‌జీవో (ఢిల్లీ) జనరల్ సెక్రటరీ రజనీ గాంధీ, రీజినల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం. వాసు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *