ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వమిది : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-అవగాహనతో క్యాన్సర్‌ నిర్మూలన
-ఎ.కె.టి.పి.ఎం. హైస్కూల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన శాసనసభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యానికి మించిన సంపద లేదని.. ముందస్తు అవగాహనతో చికిత్సలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నిర్మూలించవచ్చని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని ఎ.కె.టి.పి.ఎం. హైస్కూల్ లో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి ఆధ్వర్యంలో ఒమేగా క్యాన్సర్ ఆస్పత్రి వారి సౌజన్యంతో పేదలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలలో చైతన్యాన్ని పెంచి.. క్యాన్సర్ వ్యాధి మరణాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. క్యాన్సర్‌ నిపుణుల సాయంతో ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం ద్వారా వీలైనంత తొందరగా వ్యాధిని గుర్తించి వారికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుందన్నారు. ఏటా భారతదేశంలో పది లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. రొమ్ము క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌, కాలేయ క్యాన్సర్‌, రక్త క్యాన్సర్‌, బోన్‌ క్యాన్సర్‌ లాంటి అనేక రకాలైన కాన్సర్లు మనిషి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయన్నారు. అయితే ముందస్తు నిర్థారణ, నివారణ చర్యలతో పాటు ఆధునిక చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ మరణాలను చాలా వరకూ నివారించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే, అంత సమర్థవంతంగా చికిత్స అందించడానికి అవకాశం ఉంటుందని మల్లాది విష్ణు అన్నారు. కావాల్సినంత శారీరక వ్యాయామం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు. మరోవైపు పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా 71 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలు నమోదవుతున్నాయని.. ఇది మొత్తం క్యాన్సర్ మరణాల్లో 22 శాతంగా ఉందన్నారు. కాబట్టి పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా పక్కనపెట్టాలని సూచించారు.

ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా, ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి  పనిచేస్తున్నారని మల్లాది విష్ణు  అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడమే ధ్యేయంగా అడుగులు వేస్తూ.. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ సేవల్లో ఘననీయమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1,096 చికిత్సలను మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాగా.. వాటిని ఈ ప్రభుత్వం 2,446 కు పెంచడం జరిగిందన్నారు. ఆస్పత్రుల బకాయిలను సైతం ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల్లోని 130 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పేదలు వైద్యం పొందే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. కోవిద్ బాధితులకు ఉచితంగా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచామన్నారు. అదేవిధంగా ఏవైనా ప్రైవేట్ ఆస్పత్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని వెల్లడించారు.

స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తోందని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లోనూ శర్వాణీ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం వైద్య నిపుణులు దాదాపు 200 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు బాలి గోవింద్, పెనుమత్స శిరీష సత్యం, డివిజన్ ఇంఛార్జి దోనేపూడి శ్రీనివాస్, నాయకులు మైలవరపు రాము, కమ్మిలి రత్న, కె.ఫణి, సనత్, రాజశేఖర్, ఉద్ధంటి సురేష్, బంకా భాస్కర్, డాక్టర్లు అరుణ, రిహానా, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *