-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, ధైర్యసాహసాలకు ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులుగారని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి కలెక్టర్ లక్ష్మీశ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి ప్రకాశం పంతులు అని కొనియాడారు. స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ పాలకుల ఎదుట నిర్భయంగా నిలిచి, తన సాహసాన్ని చాటుకున్న ప్రకాశం పంతులు తెలుగువారి ధైర్యసాహసాలకు, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం, ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేసిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనియమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
Prajavartha Online Telugu News