ఉద్యోగుల ఉత్సాహానికి క్రీడలే ఊతం

-ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం.. క్రీడలతోనే సాధ్యం
-టీమ్‌ స్పిరిట్‌తో విధుల్లోనూ మెరుగైన పనితీరు
-ఉద్యోగుల మధ్య ఐక్యత, స్నేహభావానికి ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్ వేదిక
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
యునైటెడ్ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్–ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మెగా క్రికెట్ టోర్నమెంట్ (ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్) పోటీలు ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడులోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉత్సాహభరితంగా జరిగాయి. టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన విజేతలకు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ ఆదివారం బహుమతులు ప్రదానం చేశారు.
ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్‌లో ఇరిగేషన్–1, ఇరిగేషన్–2, ఎడ్యుకేషన్, రెవెన్యూ, సెక్రటేరియట్–1, పంచాయతీరాజ్, ఏపీ ఎన్జీవో–1, ఏపీ ఎన్జీవో–2, మున్సిపల్, సెక్రటేరియట్–2 మొత్తం పది జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో ఏపీ ఎన్జీవో, స్కూల్ ఎడ్యుకేషన్ జట్లు తలపడగా ఏపీ ఎన్జీవో జట్టు టైటిల్ ను చేజిక్కించుకుంది. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ టీం నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 149 పరుగుల దగ్గర ఆగిపోవడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ జట్టు ఘన విజయం సాధించింది.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ క్రీడలు ఉద్యోగులలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే ఉద్యోగులకు క్రీడలు మంచి విరామాన్ని అందించడంతో పాటు ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతాయని పేర్కొన్నారు. క్రికెట్ వంటి జట్టు క్రీడలు టీమ్‌వర్క్, నాయకత్వ లక్షణాలు, సమన్వయం, పరస్పర సహకారం, నిర్ణయ సామర్థ్యం వంటి గుణాలను పెంపొందిస్తాయని తెలిపారు. కార్యాలయాల్లో కూడా సమష్టిగా పనిచేసే వాతావరణాన్ని క్రీడలు బలోపేతం చేస్తాయని అన్నారు. ఉద్యోగులు విధులతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను, పాల్గొన్న ఉద్యోగులను అభినందించారు.
క్రీడా స్ఫూర్తితో ఉద్యోగుల్లో ఐక్యత – ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్
ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఐక్యత, ఆత్మీయతను పెంపొందించడంలో క్రీడలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ అన్నారు. ఉద్యోగులు రోజువారీ విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి ఉత్సాహంగా పనిచేయడానికి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. విజయం సాధించాలనే పట్టుదలతో పాటు ఓటమిని స్వీకరించే మనస్తత్వం, క్రమశిక్షణ, సమయపాలన, సహచరులపై నమ్మకం వంటి విలువలను క్రీడలు నేర్పుతాయని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమానికి ఏపీ ఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్న అన్ని జట్లను అభినందిస్తూ, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ UTJA అసోసియేషన్ నిర్వాహకులు పి .రమేష్బాబు, ప్రసాద్,సాయికృష్ణ,చిన్ని, అజయ్ ఏపీ ఎన్ జి ఓ నాయకులు రజనీష్ బాబు ఎం రాజ్య లక్ష్మి పి .జానకి డి సత్య నారాయణరెడ్డి పి రమేష్ వి వి ప్రసాద్ జి రామకృష్ణ కె శివలీల శ్రీదేవి ఉద్యోగులు క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *