-డ్రగ్స్ రహిత విజయవాడగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు, ముఖ్యంగా యువత సంపూర్ణ సహకారం అందించాలని బొండా రవితేజ పిలుపునిచ్చారు
-అనంతరం డ్రగ్స్ & గంజా మానేసిన యువతకు బొండా ఉమామహేశ్వరరావు తరఫున క్రీడా దుస్తులను పంపిణీ చేశారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్‌సింగ్‌నగర్‌లోని సెంట్ ఆన్స్ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన “డ్రగ్స్‌పై దండయాత్ర – ఈగల్ ఛాలెంజ్” కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఈగల్ టీం ఐజీ ఆర్.కే. రవికృష్ణ, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా మార్చే లక్ష్యంతో ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారికి నగదు పురస్కారాలు అందిస్తామని వెల్లడించారు.
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 32 మందిపై కఠినమైన కేసులు నమోదు చేశామని, మాదకద్రవ్యాల వినియోగంపై స్థానికంగా 1,200 మందికి పరీక్షలు నిర్వహించామని సీపీ తెలిపారు. విజయవాడ నగరాన్ని గంజాయి, డ్రగ్స్, బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక కార్యకలాపాల నుంచి విముక్తి చేసేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
ఈగల్ టీం ఐజీ ఆర్.కే. రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఈగల్ టీం పనిచేస్తోందని తెలిపారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనం కావడంతో పాటు కుటుంబాలు కూడా తీవ్రంగా నష్టపోతాయని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ గంజాయి సాగు, సరఫరాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
బొండా రవితేజ మాట్లాడుతూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవడం సమాజం మొత్తం బాధ్యత అని అన్నారు, డ్రగ్స్‌కు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి రంగాల్లో యువత రాణించాలని సూచించారు. విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు పోలీస్ శాఖకు టీడీపీ, యువత, ప్రజల తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News