చదరంగం కదిలింది.. బాల మేధస్సు వెలిగింది!

-200 మందికి పైగా విద్యార్థులతో చెస్ టోర్నమెంట్‌
-విజేతలకు బహుమతులు అందజేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ అమరావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సమన్వయంతో పాఠశాల స్థాయి బాలబాలికల కోసం ఒకరోజు రాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ అమరావతి చార్టర్ ప్రెసిడెంట్ డా. కొడాలి వల్లి, చార్టర్ సెక్రటరీ డా. హిమబిందు, డా. ఐశ్వర్య యలమంచిలి చెస్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

ఈ పోటీని మొత్తం 7 రౌండ్లలో నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ చెస్ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలో మొత్తం 25 బహుమతులతో పాటు నగదు బహుమతులు విజేతలకు అందజేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్లు అందించారు. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలను ఎంతో ఓర్పుతో చెస్ పోటీలకు తీసుకువచ్చిన తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, ఏకాగ్రత, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో చెస్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందడుగు వేసిన రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ అమరావతి బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఓపెన్ కేటగిరీలో ప్రథమ బహుమతి: విజ్జి హేమంత్ కుమార్, ద్వితీయ బహుమతి: గాజుల మేఘాశ్యాం సాయి, తృతీయ బహుమతి: నందగోపాల్ సాధించారు. అంతర్జాతీయ రేటెడ్ చెస్ కోచ్‌లు కె.సురేష్, యు.దాసు టోర్నమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డా. రామ్ చంద్, పి. అప్పారావు, శివ తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడానికి తమ సేవలను అందించారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో చెస్ క్రీడపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారి మేధో సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *